ఫోని తుఫాన్ ఎఫెక్ట్ : ఒడిశాలో ఎన్నికల కోడ్ ఎత్తివేత

ఒడిషా రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేశారు. కోడ్ ఎత్తివేతపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఫోని తుఫాన్ వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని.. ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
మొత్తం 11 తీర ప్రాంత జిల్లాల్లో నియమావళిని ఎత్తివేశారు. జగత్సింగ్ పూర్, కేంద్రపర, భద్రక్, బాలాసోర్, మయూర్‌బంజ్, జైపూర్, గజపతి, గంజాం, ఖుర్ధా, కటక్, జైపూర్ జిల్లాలు ఉన్నాయి. ఎన్నికల్లో భాగంగా ఒడిశా 21 స్థానాల నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. నాలుగో దశ కింద ఏప్రిల్ 29వ తేదీన ఒడిశా రాష్ట్రంలో అన్ని స్థానాలకు పోలింగ్ ముగిసింది. అయినా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ సమయంలోనే ఫోని తుపాన్ వచ్చింది. గోపాల్ పూర్, చాంద్ బలి ప్రాంతాల మధ్య తీరం దాటనుంది. ఇది చాలా తీవ్రమైనది కావటం.. సహాయ చర్యలు పెద్ద ఎత్తున చేపట్టాల్సి ఉండటంతో కోడ్ ఎత్తివేస్తూ.. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
దక్షిణ పూరి ప్రాంతంలో మే 3వ తేదీన తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తీరం దాటే సమయంలో.. గంటకు 175 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి.
ఎన్నికలు ముగిసిన వెంటనే దిల్లీకి ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ వెళ్లారు. అక్కడ ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాను కలిశారు. ఫోని తుఫాన్ ప్రభావంపై చర్చించారు. తీవ్ర ప్రమాద హెచ్చరికలుండడంతో ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని కోరారు. అలాగే మే 19కి వాయిదా పడిన పాట్‌కుర అసెంబ్లీ నియోజవర్గ ఎన్నికను కూడా వాయిదా వేయాలని కోరారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గంపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఈసీ.