Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. సీఎం పదవికి ఏక్‌నాథ్ షిండే రాజీనామా
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి ఏక్‌నాథ్ షిండే మంగళవారం రాజీనామా చేశారు.

Eknath Shinde Resignd To Maharashtra CM post
Eknath Shinde Resigns To Maharashtra CM post : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి ఏక్‌నాథ్ షిండే మంగళవారం రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ తో కలిసి షిండే రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ సీపీ రాధాకృష్ణ న్ ను కలిశారు. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖను గవర్నర్ కు సమర్పించారు. అనంతరం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్ర తాత్కాలిక ముఖ్యమంత్రిగా షిండే నియమించారు. తదుపరిగా ముఖ్యమంత్రిగా కొత్తవారు బాధ్యతలు చేపట్టే వరకు షిండేనే తాత్కాలిక సీఎంగా కొనసాగనున్నారు.
మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 288 నియోజకవర్గాల్లో 232 స్థానాల్లో ఆ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఇందులో బీజేపీ అభ్యర్థులు అత్యధిక నియోజకవర్గాల్లో విజయం సాధించారు. అయితే, ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో ఏక్‌నాథ్ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ తో సోమవారం రాత్రి భేటీ అయ్యారు. సీఎం పదవి ఎవరికి అనే విషయంపై వీరి మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.
ఈ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాల్లో సీట్లు రావడంతో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బీజేపీ సీనియర్ నేత ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్లు బీజేపీ నేతల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ఏక్‌నాథ్ షిండేసైతం ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు సిద్ధంగా లేన్నట్లు సమాచారం. అయితే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్ కు మద్దతు తెలిపారు. షిండే సీఎం పదవికి రాజీనామాకు ముందు తన ‘ఎక్స్’ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేశారు. ‘నాపై ప్రేమతో కొన్ని సంఘాల వారు నన్ను కలవడానికి ముంబయి వస్తామని అడుగుతున్నారు. వారి అభిమానానికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే, నాకు మద్దతుగా అలా ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేస్తున్నా. శివసేన కార్యకర్తలు వర్ష నివాస్ (సీఎం అధికారిక నివాసం) వద్ద గానీ, మరెక్కడా గానీ గుమ్మికూడవద్దని కోరుతున్నా. బలమైన, సుపంపన్న మహారాష్ట్ర కోసం మహా కూటమి బలంగా ఉంది. అలాగే కొనసాగుతుంది కూడా’ అని షండే పేర్కొన్నారు. షిండే పోస్టు ప్రకారం.. సీఎం రేసు నుంచి ఆయన తప్పుకుంటున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.
బీజేపీ కేంద్ర పెద్దలతో జరిగిన సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్ కు ముఖ్యమంత్రి పదవి అప్పగించేందుకు ఏక్ నాథ్ షిండే ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. బీజేపీకి ఎక్కువ స్థానాలు రావడంతోపాటు.. అజిత్ పవార్ కూడా ఫడ్నవీస్ కు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో షిండే, అజిత్ డిప్యూటీ సీఎంలుగా, ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అయితే, శాఖల కేటాయింపు విషయంపై వీరి మధ్య చర్చ జరుగుతుందని, వీటిపై క్లారిటీ వచ్చిన తరువాత ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.