కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లుగా జ్ఞానేశ్ కుమార్, సుఖ్ బీర్ సందు
SS Sandhu-Gyanesh Kumar: ఈ ఇద్దరి పేర్లను కేంద్ర ఎన్నికల సంఘ కమిషనర్లుగా ఖరారు చేసినట్లు లోక్ సభ ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి చెప్పారు.

S S Sandhu, Gyanesh Kumar
కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేశ్ కుమార్, సుఖ్ బీర్ సందు నియమితులు కానున్నారు. వారి ఎంపిక ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రపతి ఉత్తర్వుల తరువాత అధికారికంగా నియామకం జరగనుంది. కేరళకు చెందిన జ్ఞానేశ్ కుమార్, పంజాబ్‌కు చెందిన సుఖ్ బీర్ సంధు కొత్త ఎన్నికల కమిషనర్లుగా నియమితులు కానున్నారు.
ఈ ఇద్దరి పేర్లను కేంద్ర ఎన్నికల సంఘ కమిషనర్లుగా ఖరారు చేసినట్లు లోక్ సభ ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి చెప్పారు. ఇద్దరు కమిషనర్లను హైపవర్డ్ కమిటీ ఎంపిక చేసిందని తెలిపారు. ప్రధాని అధ్యక్షతన హైపవర్డ్ కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా, జ్ఞానేశ్ కుమార్ 1988 బ్యాచ్ ఐఏఎస్. మినిస్ట్రీ ఆఫ్ కో అపరేటివ్ లో పనిచేస్తున్నారు. గతంలో మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంట్ ఎఫైర్స్ లో పనిచేశారు. సుఖ్‌బీర్ సింగ్ సంధు ఉత్తరాఖండ్ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఈ ఏడాది జనవరి 31న ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ చేశారు. గతంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్‌గా పనిచేశారు.
నూతన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక చట్టం ప్రకారం నూతన కమిషనర్లను నియమిస్తున్నారు. ప్రధాన మంత్రి, కేంద్ర హోం మంత్రి, లోక్ సభలో ప్రతిపక్ష నేత నేతృత్వంలోని ఎంపిక కమిటీ చేసే సిపార్సుల ఆధారంగా నియమితులవుతున్నారు. క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ఎంపిక చేసిన ప్యానల్ సెలెక్ట్ కమిటీకి ప్రతిపాదించిన తర్వాత అందులోంచి అర్హులైన వారిని ఎంపిక చేయాలని కొత్త చట్టం చెబుతోంది.
Also Read: 34 మంది అభ్యర్థులతో టీడీపీ రెండో లిస్ట్ విడుదల