వ్యవసాయ బిల్లులపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్న విపక్షాలు

వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు కొత్త బిల్లులపై విపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఈ మూడు కొత్త బిల్లుల వల్ల రైతులకు స్వేచ్ఛ లభిస్తుందని ప్రధాని అన్నారు. కానీ దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కొందరు.. ఈ విషయంలో రైతులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
బిల్లులు రైతులకు ఎంతో మేలు చేస్తాయని మోడీ తెలిపారు. వీటితో అన్నదాతలకు స్వేచ్ఛ లభిస్తుందని ఆభిప్రాయపడ్డారు. మధ్యవర్తుల నుంచి రైతులను ఈ బిల్లులు కాపాడతాయని చెప్పారు.
బిహార్లోని వివిధ రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, బీహార్ లో రూ.3వేల కోట్లతో నిర్మించిన పలు రైల్వే, విద్యుత్ ప్రాజెక్టులను ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ ప్రారంభించారు. అనంతరం కోసి రైల్ మెగా వంతెనను జాతికి అంకితమిచ్చారు. ఈ ప్రాజెక్టుల వల్ల బిహార్ రైల్వే వ్యవస్థ మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనితో పాటు బంగాల్- తూర్పు భారత రైల్వే వ్యవస్థ కూడా అనుసంధానమవుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభంతో బీహార్ వాసుల 86ఏళ్ల నిరీక్షణ ముగిసింది. ఈ సందర్భంగా బీహార్‌లో రైలు కనెక్టివిటీ రంగంలో కొత్త చరిత్ర సృష్టించబడిందని ప్రధాని మోడీ అన్నారు.