నన్ను సీఎంను చేయండి : గవర్నర్‌కు లేఖ రాసిన రైతు

  • Published By: madhu ,Published On : November 1, 2019 / 09:21 AM IST
నన్ను సీఎంను చేయండి : గవర్నర్‌కు లేఖ రాసిన రైతు

Updated On : November 1, 2019 / 9:21 AM IST

మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నాయి. కానీ ఇంకా  నూతన ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడంపై బీడ్ జిల్లాలోని ఓ రైతుకు కోపం వచ్చింది. 2019, నవంబర్ 01వ తేదీన గవర్నర్‌కు ఏకంగా లేఖ రాశారు. అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం సీటు కోసం బీజేపీ -శివసేన మల్లగుల్లాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ పార్టీల సమస్య తీరేవరకు తనకు ముఖ్యమంత్రి పదవిని అప్పగించాలని బీడ్ జిల్లాకు చెందిన రైతు శ్రీకాంత్ విష్ణు గడాలే గవర్నర్ భగత్ సింగ్ కోష్యారికి రాసిన లేఖలో పేర్కొన్నారు. సీఎంగా తాను రైతుల సమస్యలను పరిష్కరిస్తానని, వారికి న్యాయం చేస్తానని లేఖలో చెప్పుకొచ్చారు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

మరోవైపు మహారాష్ట్రలో బీజేపీ శివసేనల మధ్య వివాదం ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. 50 – 50 ఫార్మూలాను అంగీకరించబోమంటున్న మిత్రపక్షం శివసే..బీజేపీని కోలుకోలేని విధంగా దెబ్బ తీసేందుకు కత్తులు నూరుతోంది. ముఖ్యమంత్రి పదవిపై స్పష్టత ఇచ్చేవరకు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాబోదని శివసేన కుండబద్ధలు కొడుతోంది. అదే సమయంలో బీజేపీ సహకారం లేకుండానే తాము ప్రభుత్వం ఏర్పాటు చేయగలమనే స్ట్రాంగ్ సిగ్నల్స్ పంపింది. కాంగ్రెస్‌ – ఎన్సీపీ కూటమిలో చేరే దిశగా అడుగులు వేస్తోంది.

శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్ శరద్‌పవార్‌ను కలిసి చర్చలు జరపడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. ఎన్సీపీ -కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాతోనే బీజేపీతో శివసేన అమీతుమీకి సిద్ధమైనట్లు టాక్.
 

Read More : ఢిల్లీలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ..నిర్మాణ పనులపై నిషేధం