2 షాకింగ్‌ ఘటనలు.. కొడుక్కి చూసిన అమ్మాయిని పెళ్లాడిన తండ్రి.. కూతురికి కాబోయే భర్తతో తల్లి పరార్

యువతితో వెళ్లిపోయేటప్పుడు ఇంట్లో నుంచి రూ.2 లక్షల నగదు, 17 గ్రాముల బంగారం తీసుకెళ్లాడు.

2 షాకింగ్‌ ఘటనలు.. కొడుక్కి చూసిన అమ్మాయిని పెళ్లాడిన తండ్రి.. కూతురికి కాబోయే భర్తతో తల్లి పరార్

Updated On : June 20, 2025 / 5:40 PM IST

పెళ్లి బంధాన్ని ఎంతో పవిత్రంగా భావించే మన సమాజంలో కొన్నిసార్లు ఊహకు కూడా అందని ఘటనలు జరుగుతుంటాయి. బంధాలు, బాధ్యతలు తారుమారై, నైతిక విలువలు పక్కదారి పట్టినప్పుడు ఏం జరుగుతుందో చెప్పడానికి ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన రెండు ఘటనలే నిదర్శనం.

కొడుకు కోసం చూసిన అమ్మాయిని తండ్రే ఇష్టపడి పాడు పనులు చేశాడు. కూతురు కట్టబోయే తాళిని తల్లే లాక్కోవడం వంటి ఈ వింత సంఘటనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.

కొడుక్కి చూసిన అమ్మాయిని పెళ్లాడిన తండ్రి  

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో జరిగిన ఈ ఘటన అందరినీ విస్మయానికి గురిచేసింది. షకీల్ అనే వ్యక్తి తన 15 ఏళ్ల కొడుకు పెళ్లి కోసం ఒక యువతిని చూశాడు. కానీ, కొడుకుతో కంటే తానే ఆ అమ్మాయితో ఎక్కువ చనువుగా ఉండటం మొదలుపెట్టాడు.

ఈ విషయంపై షకీల్ భార్య షబానా మాట్లాడుతూ.. “మా ఆయన రోజంతా ఆమెతో వీడియో కాల్స్‌లో మాట్లాడేవాడు. మొదట నేను చెప్పినా ఎవరూ నమ్మలేదు. కానీ, ఒకరోజు నేను, నా కొడుకు కలిసి వాళ్లిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాం. అప్పటికిగానీ నిజం బయటపడలేదు” అని కన్నీటిపర్యంతమైంది. తనకు ఆరుగురు పిల్లలు ఉన్నారని చెప్పింది.

తండ్రి వ్యవహారం తెలుసుకున్న కొడుకు.. ఆ యువతిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. ఇదే అదనుగా భావించిన తండ్రి షకీల్.. రూ. 2 లక్షల నగదు, 17 గ్రాముల బంగారం ఇంట్లో నుంచి తీసుకెళ్లి మరీ ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Also Read: “పుష్ప” స్టైల్‌లో “రప్పా రప్పా” ప్లకార్డ్స్‌పై పవన్‌ సీరియస్‌.. రౌడీషీట్లు తెరుస్తామంటూ..

కూతురికి కాబోయే భర్తతో తల్లి పరార్
ఇదే తరహాలో ఏప్రిల్ నెలలో అలీగఢ్‌లో జరిగిన మరో ఘటన మానవ సంబంధాలకే మాయని మచ్చగా మిగిలింది. శివానీ అనే యువతికి రాహుల్ అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. అయితే, పెళ్లికి పది రోజుల ముందు శివానీ తల్లి అనిత తనకు కాబోయే అల్లుడు రాహుల్‌తో కలిసి పారిపోయింది.

ఈ ఘటనపై శివానీ మాట్లాడుతూ.. “నా పెళ్లి ఏప్రిల్ 16న జరగాల్సి ఉండగా, మా అమ్మ ఏప్రిల్ 6నే రాహుల్‌తో వెళ్లిపోయింది. గత మూడు, నాలుగు నెలలుగా వాళ్లు ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుకుంటున్నారని నాకు ముందే అనుమానం వచ్చింది” అని వాపోయింది.

శివానీ తండ్రి జితేంద్ర కుమార్ మాట్లాడుతూ.. “నేను బెంగుళూరులో వ్యాపారం చేస్తాను. వాళ్లిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్న విషయం నాకు తెలిసినా, పెళ్లి దగ్గర పడిందని ఏమీ అనలేకపోయాను” అని తన నిస్సహాయతను వ్యక్తం చేశారు.

ఈ రెండు ఘటనలు సమాజంలో మారుతున్న మానవ సంబంధాలు, నైతిక విలువల పతనంపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.