అస్సాంలో తొలి కేసు.. నాలుగేళ్ల చిన్నారికి కరోనా?

అస్సాం రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. నాలుగన్నర సంవత్సరాల చిన్నారికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు జొరాట్ మెడికల్ కాలేజీ వెల్లడించింది. ఆ చిన్నారితో పాటు కుటుంబం మొత్తాన్ని క్వారంటైన్‌కు తరలించారు. దానిని ధ్రువీకరించుకునేందుకు శాంపుల్స్‌ను ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎమ్ఆర్)కు పంపారు. ఆదివారం మధ్యాహ్నం వచ్చే రెండో రిపోర్ట్ పై ఫలితాలు ఆధారపడి ఉంటాయి.
చిన్నారితో పాటు ఆమె సోదరిని, తల్లిని ఐసోలేషన్ వార్డు వరకూ తీసుకొచ్చారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇదే తొలి కేసు. అంతకంటే ముందు అమెరికా నుంచి ఇద్దరు టూరిస్టులు భూటాన్ మీదుగా అస్సాంలో పర్యటించారు. వారికి భారత్ వచ్చిన తర్వాతే లక్షణాలు కనిపించాయి. వీరు 421మందిని కలిసినట్లు గుర్తించి 160మందికి పరీక్షలు చేసి నెగిటివ్ గా గుర్తించారు. మిగిలినవారికి పరీక్షలు చేయించాల్సి ఉంది.
ఇప్పటికే కరోనాతో పోరాడేందుకు అస్సాం రాష్ట్రం సరిహద్దులు మూసేసింది. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి ప్రజల రాకపోకలను అడ్డుకుంది. అంతేకాకుండా 30రోజులుగా విదేశాల్లో ఉన్న అస్సామీలకు 2వేల డాలర్లు పంపింది.
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 332కి చేరింది. నలుగురు చనిపోయారు. 22 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 21కి చేరింది. ఏపీలో 5 కరోనా కేసులు నమోదయ్యాయి. మన దేశంలో 22 రాష్ట్రాలకు మహమ్మారి విస్తరించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 63 కరోనా కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.