ఒక్కరోజే 84వేల కరోనా కేసులు…ఒక్క న్యూయార్క్ లోనే ఏ దేశంలో లేనన్ని కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 1.5మిలియన్ మార్క్ దాటింది. ఇప్పటివరకు కరోనా సోకినవారి సంఖ్య 15లక్షల 19వేల 195గా ఉంది. ఇక మరణాల విషయానికొస్తే 88వేల 529 నమోదయ్యాయి. కోలుకున్న వారి సంఖ్య కేవలం 3లక్షల 30వేల 862గా ఉంది. అయితే బుధవారం ఒక్కరోజే 84వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. (చైనాయే ఏంటి, మనమూ కట్టగలం.. తెలంగాణలో 10 రోజుల్లో 1500 పడకల కరోనా ఆస్పత్రి)
ఇక అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. ఇక మహమ్మారి కరోనా సోకి అమెరికాలో ఇప్పటి వరకు దాదాపు 14 వేల 797 మంది చనిపోయారు. 4లక్షల 35వేల 160 మంది ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడ్డారు. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీల్లో పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. ఒక్క న్యూయార్క్ లోనే 1లక్షా 51వేల 171 కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో ఏ దేశంలో నమోదవనన్ని కేసులు ఒక్క న్యూయార్క్ లోనే నమోదయ్యాయి అంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.కాగా కరోనాతో అమెరికాలో మృతి చెందిన భారతీయుల సంఖ్య 11కు చేరినట్లు సమాచారం.
ఇక 1లక్షా 48వేల 220 కేసులతో అత్యధిక కరోనా కేసులు నమోదైన రెండవ దేశంగా స్పెయిన్ నిలిచింది. 1లక్షా 39వేల 422 కేసులతో ఇటలీ 3వ స్థానంలో నిలిచింది. 1లక్షా 13వేల 296 కేసులతో జర్మనీ నాల్గవ స్థానంలో నిలిచింది. 1లక్షా 12వేల 950కేసులతో ఫ్రాన్స్ ఐదవ స్థానంలో ఉంది. అయితే వైరస్ కు పుట్టిల్లు అయిన చైనా మాత్రం 81 వేల 865 కేసులతో చైనా ఆరవ స్థానంలో ఉంది. ఇక కరోనా మరణాల విషయానికొస్తే…అగ్రరాజ్యంతో పోటీ పడుతోంది ఇటలీ. ఇటలీలో అత్యధికంగా 17వేల 669 మరణాలు నమోదయ్యాయి. ఇటలీ తర్వాత అమెరికాలో అత్యధికంగా 14వేల 797 మరణాలు నమోదయ్యాయి.
ఇక భారత్ లో ఇప్పటివరకు 5,734 కరోనా కేసులు నమోదయ్యాయి. 166 మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 1,135 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత కరోనా కేసులు ఎక్కువగా తమిళనాడులో(738) నమోదయ్యాయి. 699 పాజిటివ్ కేసులతో ఢిల్లీ మూడవ స్థానంలో నిలిచింది.