విదేశాల్లోని భారతీయులను మే 7 నుంచి దశలవారీగా తీసుకొస్తాం: కేంద్రం

  • Published By: vamsi ,Published On : May 4, 2020 / 02:14 PM IST
విదేశాల్లోని భారతీయులను మే 7 నుంచి దశలవారీగా తీసుకొస్తాం: కేంద్రం

Updated On : May 4, 2020 / 2:14 PM IST

విదేశాలలో ఒంటరిగా ఉంటున్న భారతీయులకు ఒక పెద్ద ఊరట కలిగించే వార్తను కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కోవిడ్‌-19 లాక్‌డౌన్‌లతో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను మే 7వ తేదీ నుంచి దేశానికి రప్పించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. దశలవారీగా విమానాలు, నౌకల ద్వారా స్వదేశానికి వారిని రప్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం నిర్థిష్ట విధివిధానాలను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది.

దశలవారీగా విదేశాల నుంచి వారిని తీసుకుని వచ్చేందుకు భారతీయ రాయబార కార్యాలయాలు.. హై కమీషన్లు బాధిత భారతీయ పౌరుల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. విమాన ప్రయాణానికి షెడ్యూల్ కాని వాణిజ్య విమానాలు ఏర్పాటు చేయబడతాయని హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  ఆయా దేశాల భారత రాయబార కార్యాలయాలు దేశానికి తిరిగివచ్చే భారత పౌరుల జాబితాలను సిద్ధం చేస్తాయని, అయితే స్వదేశానికి వచ్చేందుకు అయ్యే చార్జీలను ప్రయాణీకులే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది కేంద్రం.

విమానంలో ప్రయాణించే ముందు ప్రయాణికులను మెడికల్ స్క్రీనింగ్ చేస్తామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కోవిడ్-19 లక్షణాలు లేని ప్రయాణీకులను మాత్రమే ప్రయాణించడానికి అనుమతిస్తారు. ప్రయాణ సమయంలో, ఈ ప్రయాణీకులందరూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్ ప్రోటోకాల్‌లను అనుసరించాల్సి ఉంటుంది. భారత్‌కు చేరుకున్న తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి రెండు వారాలు క్వారంటైన్‌లో ఉంచి వారివారి స్వస్థలాలకు వారిని పంపిస్తారు.