ఏడాదిన్నరపాటు వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేత

ఏడాదిన్నరపాటు వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేత

Updated On : January 20, 2021 / 9:18 PM IST

Govt ready to suspend farm laws నూతన వ్యవసాయ చట్టాలపై బుధవారం(జనవరి-20,2021 )ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్రానికి, రైతు సంఘాల నాయకుల మధ్య జరిగిన పదో విడత చర్చలు ముగిశాయి. ఐదు గంటలపాటు రైతు నాయకులతో కేంద్రం సుదీర్ఘంగా చర్చించింది. నేడు 10వ విడత చర్చల సందర్భంగా మూడు సాగు చట్టాలను సవరించేందుకు మరోసారి ప్రతిపాదించింది కేంద్రం. అయితే ఈ ప్రతిపాదనను రైతు సంఘాల నేతలు వ్యతిరేకించారు. చట్టాలను పూర్తిగా రద్దు చేసుకోవాలన్నదే తమ డిమాండ్​ అని తేల్చిచెప్పారు.

పదో విడత చర్చల్లోనూ ప్రతిష్టాంభన కొనసాగడంతో.. జనవరి 22న మరోసారి రైతు సంఘాలతో చర్చలు జరపాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రం కొంత మేర వెనక్కి తగ్గేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇవాళ రైతు నేతలతో సుదీర్ఘంగా సాగిన చర్చల్లో కీలక ప్రతిపాదనలు చేసింది కేంద్రం. తొలుత సాగు చట్టాలను ఏడాది పాటు వాయిదా వేస్తామని ప్రతిపాదించగా అందుకు రైతులు నిరాకరించారు. ఆ తర్వాత ఏడాదిన్నరకు పెంచింది కేంద్రం.

అయినప్పటికీ రైతుల నుంచి సానుకూలత రాకపోవటంతో కమిటీ వేసి వ్యవసాయ చట్టాల్లో అభ్యంతరాలపై అధ్యయనం చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రతిపాదించింది. కాలపరిమితి లేకుండా కమిటీ నివేదిక వచ్చే వరకు మూడు వ్యవసాయ చట్టాలను నిలిపివేస్తామని కేంద్రం ప్రతిపాదించగా… దీనిపై అందరం చర్చించుకుని తుదినిర్ణయం వెల్లడిస్తామని రైతులు తెలిపారు. కేంద్రం ప్రతిపాదనపై చర్చించేందుకు గురువారం రైతు నేతలు భేటీ కానున్నారు. రైతులు సానుకూల దృక్పథంతో ఆలోచించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.