Covid Plasma Therapy : ప్లాస్మా థెరపీ ఆపేయండి

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్లాస్మా థెరపీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ రోగులకు అందించే చికిత్స విధానాల్లో మార్పులు చేసింది. కోవిడ్‌ చికిత్స జాబితా నుంచి ప్లాస్మా థెరపీని తప్పించింది.

Covid Plasma Therapy : ప్లాస్మా థెరపీ ఆపేయండి

Govt Removes Plasma Therapy As Treatment For Covid 19 Among Adults

Updated On : May 18, 2021 / 10:43 AM IST

Plasma therapy as treatment for Covid-19 : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్లాస్మా థెరపీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ రోగులకు అందించే చికిత్స విధానాల్లో మార్పులు చేసింది. కోవిడ్‌ చికిత్స జాబితా నుంచి ప్లాస్మా థెరపీని తప్పించింది. కరోనా రోగులకు ఇక నుంచి ప్లాస్మా థెరపీ పద్దతిలో చికిత్స ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎయిమ్స్, ICMR, కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్, జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సంయుక్తంగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేశాయి.

గత ఏడాది కరోనా వేళ ఎక్కువగా వినిపించిన పేరు ప్లాస్మా థెరపీ. కరోనాను జయించిన వారి నుంచి ప్లాస్మాను సేకరించి పరిస్థితి సీరియస్‌గా ఉన్న బాధితులకు ఎక్కించేవారు. తద్వారా అతడి శరీరంలో యాంటీబాడీలు తయారై కరోనాను అడ్డుకుంటాయని డాక్టర్లు చెప్పారు. కానీ పెద్దగా సానుకూల ఫలితాలు లేకపోవడంతో ప్లాస్లా థెరపీని పక్కన పెట్టారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం శ్వాసం తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుంటే స్వల్ప లక్షణాలుగా భావించాలని, అలాంటి వారిని హోమ్ ఐసోలేషన్‌లోనే ఉంచి చికిత్స అందించాలని సూచించింది.

ఇక రక్తంలో ఆక్సిజన్ స్థాయి 90 నుంచి 93 మధ్యన ఉన్నా.. రెస్పిరేటరీ రేటు నిమిషానికి 24 కన్నా ఎక్కువగా ఉంటే… రోగ లక్షణాలు మధ్య స్థాయిగా ఉన్నట్టు గుర్తించాలని కేంద్రం సూచింది. ఇలాంటి రోగులను ఆస్పత్రుల్లోని సాధారణ వార్డులో చేర్పించి చికిత్స అందించాలంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయులు 90 కంటే తక్కువగా ఉండి.. రెస్పిరేటేరీ రేటు నిమిషానికి 30 కంటే ఎక్కువగా ఉంటే.. సీరియస్ కేసుగా పరిగణించాలని.. ఆ లక్షణాలు ఉన్న రోగులను వెంటనే ఆస్పత్రి ఐసీయూలో అడ్మిట్ చేసి చికిత్స మొదలెట్టాలని తెలిపింది.