No Mutton No Marriage : పెళ్లిలో మటన్ కర్రీ వండలేదని వివాహం క్యాన్సిల్… మరుసటి రోజే మరో యువతితో..
టైటిల్ చూసి షాక్ అయ్యారా? కానీ ఇది నిజం. పెళ్లిలో మటన్ కర్రీ వండలేదని ఆ పెళ్లికొడుకు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.

No Mutton No Marriage
No Mutton No Marriage : టైటిల్ చూసి షాక్ అయ్యారా? కానీ ఇది నిజం. పెళ్లిలో మటన్ కర్రీ వండలేదని ఆ పెళ్లికొడుకు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా వివాహాన్నే రద్దు చేసుకున్నాడు. అంతేకాదు మరుసటి రోజే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఒడిశాలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జాజ్ పూర్ జిల్లా మనతిరా గ్రామంలో వివాహానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. అయితే విందులో మటన్ పెట్టకపోవడం వివాదానికి కారణమైంది.
తమకు మటన్ కావాలని పెళ్లికొడుకు బంధువులు అడగడంతో… మటన్ లేదని పెళ్లికూతురు బంధువులు సమాధానమిచ్చారు. దీంతో గొడవ మొదలైంది. వరుడు, వధువు తరఫువారికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ కాస్తా వరుడి దృష్టికి వెళ్లింది. తమ బంధువులకు పెళ్లికొడుకు కూడా వత్తాసు పలకడంతో వివాదం మరింత ముదిరింది.
చివరకు పెళ్లికొడుకు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన వివాహాన్ని రద్దు చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంతేకాదు మరుసటి రోజే అతను మరొక యువతిని పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.