యూపీలో హై అలర్ట్..అయోధ్య తీర్పు సమయంలో ఉగ్ర కలకలం

అయోధ్య తీర్పు రానున్న సమయంలో యూపీలోకి ఏడుగురు టెర్రరిస్టులు చొరబడ్డారు. అయోధ్య, ఫైజాబాద్, గోరఖ్‌ఫూర్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు సమాచారం. నేపాల్ సరిహద్దు గుండా ఉగ్రవాదులు ఉత్తరప్రదేశ్ లోకి చొరబడినట్లు నిఘా వర్గాల సమాచారంతో ఉత్తరప్రదేశ్ లో హై అలర్ట్ విధించారు. ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నట్లు ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ తెలిపారు. యూపీని ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నారని తెలిపారు.
అయోధ్యలో ఇవాళ(నవంబర్-5,2019)నుంచి 14కోసి పరిక్రమ ప్రారంభమైందని బుధవారం ఉదయం ఇది ముగుస్తుందని,దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారని,ఈ సమయంలోశాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ విధించినట్లు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఈ క్రమంలో యూపీకి 4 వేల మంది కేంద్ర సాయుధ బలగాలను కేంద్రం పంపింది.
ఇప్పటికే యూపీ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేయగా, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. అయోధ్యలోని రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదాస్పద కేసు తీర్పు ఈ నెల 17వ తేదీ లోపు వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలో యూపీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంటుంది. మొత్తం 15 పారామిలటరీ కంపెనీలను యూపీకి పంపించారు. నవంబర్ 18 వరకు కేంద్ర బలగాలు యూపీలో మకాం వేయనున్నాయి. యూపీలో మొత్తం 12 జిల్లాలను సమస్యాత్మక జిల్లాలుగా గుర్తించారు. వారణాసి, అయోధ్య, కాన్పూర్, అలీఘర్, లక్నో, అజంఘర్ ప్రాంతాల్లో నిఘా పెంచారు.