మైనర్ అంటూ నిర్భయ దోషి పిటిషన్ : కొట్టేసిన కోర్టు…లాయర్ కు జరిమానా

  • Published By: venkaiahnaidu ,Published On : December 19, 2019 / 11:54 AM IST
మైనర్ అంటూ నిర్భయ దోషి పిటిషన్ : కొట్టేసిన కోర్టు…లాయర్ కు జరిమానా

Updated On : December 19, 2019 / 11:54 AM IST

నిర్భయ కేసులోని దోషులు తమ ఉరిశిక్ష అమలు ఆలస్యం చేయడానికి జిత్తుల మారి తెలివితేటలు వాడుతున్నారు. చట్టాల్లోని లొసుగుల్ని అడ్డంపెట్టుకుని రోజుకో పిటిషన్‌తో ముందుకొస్తున్నారు. ఒక్కొక్కరుగా రివ్యూ పిటిషన్లు వేయడం మొదలు ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణకు వచ్చిన పవన్ గుప్తా పిటిషన్ వరకూ పెద్ద హైడ్రామానే నడిపిస్తున్నారు.

డిసెంబర్-16,2012న దేశ రాజధానిలో నిర్భయపై గ్యాంగ్ రేప్ చేసే సమయానికి తాను మైనర్‌నని, తనకు అప్పటికి 18ఏళ్లు నిండలేదని,కాబట్టి ఐపీసీ ప్రకారం ఉరి తీయడం కుదరదంటూ ఢిల్లీ హైకోర్టులో దోషుల్లో ఒకడైన పవన్ పిటిషన్ వేశాడు. తమను అరెస్ట్ చేసిన సమయంలో తన వయస్సును గుర్తించేందుకు సరైన మెడికల్ టెస్ట్ లను అధికారులు చేయలేదని తన పిటిషన్ లో పవన్ తెలిపాడు. జువెనైల్ చట్టం ప్రకారం ఏ దశలోనైనా మైనారిటీని రుజువు చేసుకునేందుకు కోరే అవకాశం ఉంది. దీంతో ఆ లూప్ హోల్‌ను అడ్డం పెట్టుకుని మరికొద్ది రోజుల్లో ఉరి ఖాయం అని వార్తలు వస్తున్న నేపథ్యంలో నేరం చేసిన ఏడేళ్ల తర్వాత తాను అమాయకుడిని అంటూ ఇప్పుడు కోర్టు మెట్లెక్కాడు.

ఇవాళ ఉదయం ఆ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా కోర్టు అనేకసార్లు సమాచారం ఇచ్చినప్పటికీ కోర్టుకి రాకుండా “హైడ్ అండ్ సీక్”ప్లే చేస్తున్న నిందితుడు పవన్ తరపు లాయర్ ఏపీ సింగ్ కు 25వేల రూపాయల ఫైన్ విధించింది కోర్టు. అంతేకాకుండా నిందితుడి వయస్సుకు సంబంధించి నకిలీ అఫడవిట్ ఫైల్ చేసినందుకుగాను లాయర్ పై చర్యలు తీసుకోవాలని బార్ కౌన్సిల్ ను ఆదేశించింది. నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్ సింగ్ వేసిన రివ్యూ పిటిషన్ ను బుధవారం సుప్రీంకోర్టు కొట్టవేసిన విషయం తెలిసిందే.