కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీలో హైటెన్షన్.. దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన ఆప్

కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసిన తరువాత ఢిల్లీలో హైటెన్షన్ నెలకొన్న నేపథ్యంలో ఢిల్లీ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఉదయం 8గగంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మెట్రో సేవలను రద్దు చేసింది.

కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీలో హైటెన్షన్.. దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన ఆప్

Delhi CM Arvind Kejriwal

Delhi Cm Arvind Kejriwal Arrested : మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్ అయ్యారు. గురువారం సాయంత్రం సమయంలో సీఎం నివాసంలో ఈడీ బృందం ఆయన్ను అరెస్టు చేసినట్లు ప్రకటించింది. ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్టు చేయడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. సీఎం కేజ్రీవాల్ అరెస్టును రాజకీయ కుట్ర అని ఆమ్ ఆద్మీ పార్టీ అభివర్ణించింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఆప్, బీజేపీ కార్యాలయాలకు వెళ్లే రహదారులను పోలీసులు మూసివేశారు. ఈడీ కార్యాలయం, రౌస్ అవెన్యూ కోర్టు వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్త నిరసనలకు ఆప్ పిలుపునిచ్చింది. ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద నిరసనలు చేపట్టేందుకు ఆప్ నేతలు భారీగా తరలివచ్చారు.

Also Read : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపగలరా? చట్టం ఏం చెబుతుంది?

కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసిన తరువాత ఢిల్లీలో హైటెన్షన్ నెలకొన్న నేపథ్యంలో ఢిల్లీ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఉదయం 8గగంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మెట్రో సేవలను రద్దు చేసింది. ఢిల్లీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంఆర్సీ తెలిపింది. దీనికితోడు ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు విధించారు. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టును ఎన్డీయే యేతర పక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కేవలం రాజకీయ కుట్ర కోణంలో భాగమే కేజ్రీవాల్ అరెస్టు అంటూ ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కేజ్రీవాల్ కుటుంబాన్ని రాహుల్ గాంధీ కలవనున్నారు. న్యాయసహాయం అందించడంపై కేజ్రీవాల్ కుటుంబానికి రాహుల్ మద్దతు ఇవ్వనున్నారు.

Also Read : Arvind Kejriwal : ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ కొనసాగుతారు.. అవసరమైతే జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారు : మంత్రి అతిషి

ఈడీ లాకప్ లో కేజ్రీవాల్ భద్రతపై ఆప్ వివరణ కోరింది. ఈ సందర్భంగా ఆప్ మంత్రి అతిశీ మాట్లాడుతూ.. దేశంలో మొదటిసారి సిట్టింగ్ సీఎంను అరెస్టు చేశారు. ఈడీ కస్టడీలో కేజ్రీవాల్ భద్రతకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తరువాత కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం ఆయన్ను ఎన్నికలకు దూరం చేసే ప్రయత్నమని ఆమె ఆరోపించారు. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని, ఆప్, కేజ్రీవాల్ కు ఇడియా కూటమి మద్దతు ప్రకటించిందని అతిశీ అన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ ముమ్మాటికి రాజకీయ కుట్ర.. బీజేపీ ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.