కర్నాటకలో దారుణం : శ్మశానమే ఆ 70 కుటుంబాలకు నివాసం

  • Published By: veegamteam ,Published On : September 4, 2019 / 04:37 AM IST
కర్నాటకలో దారుణం : శ్మశానమే ఆ 70 కుటుంబాలకు నివాసం

Updated On : September 4, 2019 / 4:37 AM IST

దేశంలో ప్రతీ ఒక్కరికి సొంత ఇళ్లు ఉండాలని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటుంటాయి. కానీ దళితులు, మైనారిటీలకు చెందిన 70 కుటుంబాలు శ్మశానంలో వంటావార్పులు చేసుకుంటూ జీవిస్తున్న సంఘటన కర్నాటక రాష్ట్రం మధుగిరి తాలూకాలోని బ్యాల్యా గ్రామంలో చోటుచేసుకుంది. 10 రోజుల నుంచి బ్యాల్యా గ్రామంలోని దళితులు, మైనారిటీలు శ్మశాన ఆకులు అలములతో పూరె గుడిసెలు వేసుకుని అక్కడే వంటావార్పులు చేసుకుంటున్నారు. 

వీరిలో 39 మంది దళిత కుటుంబాలు కాగా..మిగిలిన వారిలో షెడ్యూల్డ్ కుల వర్గాలు, లింగాయత్‌లు, ఓబిసిలు ఉన్నారు. వీరంతా రోజు వారీ కూలీలే. ఇప్పటి వరకు రాజకీయ నాయకులు కానీ, అధికారులు వీరి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఓట్ల కోసం వచ్చే నాయకులు తాము ఇంతటి దుస్థితిలో జీవిస్తున్నా పట్టించుకోవటం లేదని వారు వాపోతున్నారు. దళితులుగా పుట్టటమే మా పాపమా? ఇదే మాకు శాపంగా మారిందా? అని ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. 

తమకు ఇళ్లు కట్టించమని ఎంతో కాలంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా పట్టించుకోవటంలేదనీ.. తమకు ఇళ్లు కట్టించేంత వరకూ తాము శ్మశాసనంలోనే ఉంటామని దళిత సంరక్షణ సమితి అధ్యక్షుడు జేసీబీ వెంకటేష్‌ ఆందోళన తెలియజేశారు. తమ విన్నపాన్ని పరిష్కరించకపోతే జిల్లా స్థాయిలో కలెక్టరేట్‌ ముందు ధర్నా చేపడతామన్నారు. ఈ ఆందోళనలో దళిత నాయకులు పాల్గొన్నారు.