అమెరికాలో ఆగని మరణాలు.. కొన్ని వారాలక్రితం అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మృతి

అమెరికాలో హైదరాబాద్ కు చెందిన మరో విద్యార్థి మృతి చెందాడు.మూడు వారాల క్రితం కనిపించకుండా పోయిన హైదరాబాద్ కు చెందిన అబ్దుల్ మహ్మద్ అరాఫత్ ..

అమెరికాలో ఆగని మరణాలు.. కొన్ని వారాలక్రితం అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మృతి

Mohammad Abdul Arfath

Indian Student Dead in US : చదువులకోసం, ఉద్యోగాలకోసం పరాయి దేశాలకు వెళ్లిన వారి ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది. ఎన్నో ఆశలను మూటగట్టుకొని అమెరికాకు వెళితే చివరికి ప్రాణాలు బలిపెట్టాల్సి వస్తోంది. తాజాగా, అమెరికాలో హైదరాబాద్ కు చెందిన మరో విద్యార్థి మృతి చెందాడు.మూడు వారాల క్రితం కనిపించకుండా పోయిన హైదరాబాద్ కు చెందిన అబ్దుల్ మహ్మద్ అరాఫత్ విగతజీవిగా పోలీసులకు కనిపించాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. క్లేవ్ ల్యాండ్ పట్టణంలో ఒక సరస్సులో అబ్దుల్ మృతదేహం లభ్యమైంది. అతడి నడుముకు పాస్ పోర్ట్, మొబైల్ ఫోన్, కొన్నిపత్రాలు ఉన్నాయి. స్థానిక పోలీసులు పరిశీలించి అబ్దుల్ మృతదేహంగా గుర్తించారు. అతను ఎలా మరణించారు అనే విషయాలపై పోస్ట్ మార్టం పూర్తయిన తరువాత వివరిస్తామని క్లేవ్ ల్యాండ్ పోలీసులు తెలిపినట్లు అబ్దుల్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలాఉంటే.. అబ్దుల్ మృతదేహాన్ని హైదరాబాద్ తరలింపుపై ఇంకా స్పష్టత రాలేదు.

Also Read : ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి అనంతలోకాలకు.. ఈ ఏడాదిలోనే 10 మంది..

హైదరాబాద్ నాచారంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన మహ్మద్ సలీం కుమారుడు అబ్దుల్ మహమద్ అరాఫత్. అతను 2023 మేలో ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లాడు. ఒహియో రాష్ట్రంలోని క్లేవ్ ల్యాండ్ యూనివర్శిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. అతడు గత నెల మార్చి8న చివరిసారిగా ఫోన్ లో మాట్లాడాడు. ఆ తరువాత ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అమెరికాలో ఉంటున్న బంధువుల ద్వారా ఆరాతీశారు. కానీ, అరాఫత్ ఆచూకీ ఎక్కడా లభించలేదు. అక్కడ బంధువుల ద్వారా క్లేవ్ ల్యాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లోని నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం ఇచ్చి తన కుమారుడి ఆచూకీ కనిపెట్టాలని వేడుకున్నారు.

Also Read : Indian student Kill : అమెరికాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య

అబ్దుల్ అరాఫత్ చివరి సారిగా క్లేవ్ ల్యాండ్ లోని వాల్మార్ట్ స్టోర్ లో కనిపించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు అక్కడి పోలీసులు తెలియజేశారు. అబ్దుల్ అరాఫత్ కనిపించకుండా పోయిన పదిరోజుల తరువాత అమెరికాలోని కిడ్నాపర్ల నుంచి అరాఫత్ తండ్రికి ఫోన్ కాల్ వచ్చింది. అరాఫత్ ను కిడ్నాప్ చేశామని అడిగినంత డబ్బు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు. దీంతో బాధితుడి తల్లిదండ్రులు కేంద్ర విదేశాంగ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడిని రక్షించాలంటూ వేడుకున్నారు. కానీ, చివరికి జరగరాని ఘోరం జరిగింది.. అరాఫత్ విగజీవితగా మారాడు.

Also Read : మరో 14రోజులు.. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు

మహమ్మద్ అబ్దుల్ అరాఫత్ మృతి విషయాన్ని న్యూయార్క్ లోని భారత దౌత్య కార్యాలయం మంగళవారం ఎక్స్ ఖాతాలో ధృవీకరించింది. మేము గత కొంతకాలంగా వెతుకుతున్న మహమ్మద్ అబ్దుల్ అరాఫత్ ఒహియోలోని క్లేవ్ ల్యాండ్ లో మృతిచెందాడని తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసేందుకు స్థానిక పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాన్ని తరలించడానికి సహాయం చేస్తామని న్యూయార్క్ లోని భారత దౌత్య కార్యాలయం అధికారులు తెలిపారు. అరాఫత్ మృతితో  2024 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు  అమెరికాలో మృతిచెందిన భారతీయ విద్యార్థుల సంఖ్య 11కు చేరింది.