బ్రహెయిన్ సందర్శించిన మొదటి ప్రధాని కావడం అదృష్టం

బహ్రెయిన్ రాజధాని మనామాలో ఆ దేశ ప్రధానమంత్రి ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫాతో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ సమావేశమయ్యారు. ఓ భారత ప్రధానమంత్రి బహ్రెయిన్ లో పర్యటించడం ఇదే మొదటిసారి. బహ్రెయిన్-భారత్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కట్టుబడినట్లు ఇరుదేశాధినేతలు తెలిపారు. మోడీ వెంట జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు.
బహ్రెయిన్ ప్రధానమంత్రితో సమావేశమనంతరం బహ్రెయిన్ లో నివసిస్తున్న భారతీయ కమ్యూనిటీని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడుతూ…. ఓ భారత ప్రధాని బహ్రెయిన్ లో పర్యటించడానికి చాలా సమయం పట్టిందని రియలైజ్ అయ్యాను. ఏదేమైనప్పటికీ బహ్రెయిన్ సందర్శించిన మొదటి భారత ప్రధాని కావడం నా అదృష్టం. ప్రపంచంలో నలుమూలలా ఉన్న భారతీయ కమ్యూనిటీకి ఈ సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్ఠమి శుభాకాంక్షలు. రేపు శ్రీనాథ్ జీ ఆలయాన్ని సందర్శించి బహ్రెయిన్ దేశంలో శాంతి,శ్రేయస్సు కోసం ప్రార్థిస్తాను. అంతేకాకుండా ఈ ఆలయ పునరుద్ధరణ కూడా రేపు అధికారికంగా ప్రారంభమవుతుందనేది సంతోషకరమైన విషయం.
మీరు భారతదేశంలోని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు… వాతావరణంలో మార్పును అనుభవిస్తున్నామని వారు మీకు చెప్తారు. భారతదేశంలో మీకు మార్పు అనిపిస్తుందా? భారతదేశం యొక్క వైఖరిలో మీరు మార్పు చూస్తున్నారా? భారతదేశంపై విశ్వాసం పెరిగింది లేదా? రాబోయే 5 సంవత్సరాలలో మన దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని రెండు రెట్లు పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. మన ముందు ఉన్న లక్ష్యం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. సెప్టెంబర్ 7 న భారతదేశపు ‘చంద్రయాన్’ చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ కాబోతుందని మీ అందరికీ తెలుసు. ప్రపంచం మొత్తం ఈ రోజు భారత అంతరిక్ష కార్యకలాపాలపై చర్చిస్తోంది. మన నైపుణ్యాలను మాత్రమే ఉపయోగించి, ఈ ఫలితాలను ఇంత చిన్న బడ్జెట్‌లో ఎలా పొందగలుగుతున్నామో అని ప్రపంచం ఆశ్చర్యపోతోందని మోడీ అన్నారు.