మెరుపు దాడుల ఆధారాల‌డుగుతారా? : విప‌క్షాల‌పై మోడీ ఫైర్

  • Published By: raju ,Published On : March 3, 2019 / 11:03 AM IST
మెరుపు దాడుల ఆధారాల‌డుగుతారా? : విప‌క్షాల‌పై మోడీ ఫైర్

Updated On : March 3, 2019 / 11:03 AM IST

వాయుసేన జ‌రిపిన మెరుపుదాడులకు విపక్షాలు రుజువు అడుగుతున్నాయని, భారత సైన్యాన్ని కించపరిచే విధంగా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఆరోపించారు. భారత్ ఇంతకు ముందులా లేదని, సరికొత్త దేశాన్ని తమ ప్రభుత్వం నిర్మిస్తోందని అన్నారు. ఆదివారం(మార్చి-3,2019) బీహార్ రాజ‌ధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో  నిర్వ‌హించిన  సంకల్ప్ ర్యాలీలో బీహార్ సీఎం నితీష్ కుమార్ తో క‌లిసి పాల్గొన్న మోడీ.. సైనికులపై దాడులను తమ ప్రభుత్వం సహించబోమ‌ని  మరోసారి స్పష్టం చేశారు.పుల్వామా దాడిలో వీరజవాన్లకు సెల్యూట్ చేస్తున్నానని, జవాన్ల కుటుంబాలకు యావద్దేశం బాసటగా నిలుస్తుందని అన్నారు.  ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిపైనా మోడీ ఈ సందర్భంగా విమర్శలు ఎక్కుపెట్టారు. బీహార్‌లో దాణా పేరుతో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనంటూ ఆర్జేడీని ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు.

దశాబ్దాలుగా దేశంలో కొనసాగుతున్న అవినీతి, దళారీల సంస్కృతికి తాము సాహసంతో చరమగీతం పాడామని చెప్పారు. చౌకీదార్ ను చులకన చేసి మాట్లాడటం, విమర్శించడం ఇవాళ పరిపాటిగా మారిందని, అయితే ఈ చౌకీదార్ ఎప్పటికీ అప్రమత్తంగానే ఉంటాడని ప్రజలకు భరోసా ఇస్తున్నాడని మోడీ అన్నారు. అవినీతిని ఏమాత్రం దరిచేయానీయమని అన్నారు. రాష్ట్రంలోని 40 లోక్‌సభ  స్థానాల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించి తీరుతుందని  ధీమా వ్యక్తం చేశారు.ఉగ్రవాద సృష్టికర్తలకు వ్యతిరేకంగా ముక్తకంఠంతో మాట్లాడాల్సిన తరుణంలో ఎన్డీయేకు వ్యతిరేకంగా ఢిల్లీలో 21 పార్టీలు జట్టుకట్టడాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరని మోడీ  అన్నారు.