భారత్‌లో కరోనాతో పోరాటానికి లండన్‌లో సైకిల్ తొక్కుతున్నారు

In A Bid To Help India Fight Covid 19 Uk Volunteers Cycle 7600km On Stationary Bikes
కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారిపోయింది. ప్రపంచంలో మిగిలిన దేశాలతో పోలిస్తే పరిస్థితి భారతదేశంలో తీవ్రంగా ఉంది. ఇటువంటి సమయంలో భారతదేశానికి సపోర్ట్ చెయ్యడానికి ప్రపంచవ్యాప్తంగా దేశాలు ముందుకు వస్తున్నాయి. సహాయం చేయడానికి వారు చేయగలిగినది చేస్తున్నారు. ఈ క్రమంలోనే విదేశాలలో ఉన్న భారతీయులు కూడా తమ వంతు సహాయం చెయ్యడానికి కృషి చేస్తున్నారు.
ఇటీవల లండన్‌లోని అతిపెద్ద హిందూ దేవాలయం శ్రీ స్వామినారాయణ మందిరం కూడా భారతదేశానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది.
‘జీవితాలను కాపాడేందుకు సైకిల్..’
లండన్ నుండి ఢిల్లీ బైకాథాన్ ప్రోగ్రామ్ ద్వారా 500,000 పౌండ్లు(సుమారుగా 5.1 కోట్లు) సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుని కార్యక్రమం స్టార్ట్ చేశారు నిర్వాహకులు. భారతదేశానికి ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో 48గంటల్లో 7,600 కిలోమీటర్లు (4,722 మైళ్ళు) నిలబడి ఉన్న బైక్‌లను తొక్కడం ద్వారా నిధులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘సైకిల్ టు సేవ్ లైవ్స్’ అని పిలువబడే బైక్ సైకిల్ రైడ్‌ను నీస్‌డెన్‌లోని ఆలయ ప్రాంగణంలో ప్రారంభించారు.
12 స్టేషనరీ బైక్‌లు:
ఈ కార్యక్రమంలో భారతీయులతో పాటు స్థానికులు కూడా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఆలయం ముందు 12 స్టేషనరీ బైక్‌లను ఏర్పాటు చేశారు.
ప్రతి వాలంటీర్ కోసం 50 నిమిషాల రైడ్:
ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే ప్రతి వాలంటీర్ 50 నిమిషాలు సైకిల్ నడుపుతాడు. రైడర్ సైకిల్‌ను తదుపరి వ్యక్తికి అప్పగించే ముందు 10 నిమిషాలు శుభ్రపరచాలి.
700 మందికి పైగా వాలంటీర్లు:
ఈ కార్యక్రమానికి ఇప్పటివరకు 750 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ప్రతి వాలంటీర్ మొత్తం నిధుల సేకరణ లక్ష్యంగా సైకిల్ తొక్కుతారు.
ప్రభావితమైన కుటుంబాలు:
భారతీయ సంతతికి చెందిన ప్రతి వ్యక్తి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని భావిస్తున్నామని కార్యక్రమం నిర్వహిస్తోన్న British IT consultant Yogen Shah వెల్లడించారు. భారతీయ సంతతి వ్యక్తులే కాదు.. అనేకమంది లోకల్ వాళ్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, కరోనా కారణంగా ప్రభావితం అయిన కుటుంబాలకు హెల్ప్ చెయ్యాలని ముందుకు వస్తున్నారని చెప్పుకొచ్చారు.