ఈ చెరువులో చేపలకు బదులు లక్షలాది రూపాయల మద్యం.. ఇదెలా సాధ్యమైందో చూడండి..
పుష్ప సినిమాలో బావిలో లారీని పడేసి, అందులోని ఎర్రచందనాన్ని దాచి పెడతాడు హీరో.. ఈ సీన్‌ను గుర్తు తెచ్చేలా ఛత్తీస్‌గఢ్‌లో ఏం జరిగిందో తెలుసా?

చెరువులో వెతికితే ఏం కనపడతాయి? చేపలు, పాములు వంటివి కనబడతాయి కదా? అయితే, ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లోని ఓ చెరువులో మాత్రం మద్యం డబ్బాలు కనపడ్డాయి. లక్షలాది రూపాయల విలువజేసే మద్యం చెరువులో ఉండడం ఏంటని స్థానికులు అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతకీ చెరువులోకి మద్యం డబ్బాలు ఎలా వచ్చాయో తెలుసా?
మునిసిపల్ జనరల్ ఎన్నికల వేళ బిలాస్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఎన్నికల ప్రక్రియ ప్రస్తుతం నామినేషన్ దశలో ఉంది. దీంతో ఓటర్లకు మద్యం పంపిణీ చేసి వారిని మభ్యపెట్టేందుకు రాజకీయ నాయకులు సిద్ధమయ్యారు. అధికార యంత్రాంగం మద్యాన్ని పట్టుకోకుండా ఉండేందుకు ఎన్నో ప్లాన్‌లు వేసుకుంటున్నారు రాజకీయ నాయకులు.
తాజాగా, గనియారి ప్రాంతంలో ఎక్సైజ్ శాఖ బృందం భారీగా తనిఖీలు చేపట్టింది. ఆ ప్రాంతంలోని ఓ చెరువులో పెద్దఎత్తున మద్యం దాచినట్లు అధికారులకు సమాచారం అందింది. దీని తర్వాత వెంటనే దాడికి ప్లాన్ చేశారు అధికారులు. డైవర్ల సాయంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా చెరువులోపల మొత్తం మద్యం లభించింది.
చెరువులో మద్యం నిల్వ ఉంచారని తేలింది. 8,700 కిలోల మహువా లహాన్ (మద్యం తయారీకి వాడే మూల పదార్థం), 307 లీటర్ల మద్యం లభించింది. ఈ మద్యాన్ని ఎన్నికల సమయంలో వినియోగించేందుకు ఉంచగా, సరఫరా కాకముందే సీజ్ చేశారు. ఈ విధంగా మార్కెట్‌కు పెద్దఎత్తున అక్రమ రవాణా రాకుండా అధికారులు అడ్డుకోగలిగారు.
ఎన్నికల సమయంలో మద్యం స్మగ్లర్ల ఆగడాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పెద్దఎత్తున అక్రమ మద్యం సరఫరా చేస్తున్నారు. అయితే ఈసారి అలాంటి కేసులను అరికట్టేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇటువంటి తనిఖీలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని ఎక్సైజ్ శాఖ ఇన్‌స్పెక్టర్ కల్పనా రాథోడ్ చెప్పారు. జిల్లాలో అక్రమ మద్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎట్టిపరిస్థితుల్లోనూ మద్యాన్ని ఎన్నికల కోసం వినియోగించరాదన్నారు.