Global Trade : గ్లోబల్ ట్రేడ్ లో సత్తా చాటిన భారత్,చైనా

ఎగుమతులు,దిగుమతుల విషయంలో ప్రపంచంలోని ఇతర పెద్ద ఆర్థికవ్యవస్థలతో పోలిస్తే భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు మెరుగైన ఫలితాలు రాబట్టాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది

Global Trade : గ్లోబల్ ట్రేడ్ లో సత్తా చాటిన భారత్,చైనా

Global Trade

Updated On : May 19, 2021 / 5:49 PM IST

Global Trade ఎగుమతులు,దిగుమతుల విషయంలో ప్రపంచంలోని ఇతర పెద్ద ఆర్థికవ్యవస్థలతో పోలిస్తే భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు మెరుగైన ఫలితాలు రాబట్టాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది. 2021 మొదటి క్వార్టర్ లో((1-1-2021 నుంచి 31-3-2021)ఎగుమతులు,దిగుమతులు పెరిగాయని వెల్లడించింది. ఈ మేరకు బుధవారం యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ డెవలప్​మెంట్(UNCTAD).. ‘గ్లోబల్ ట్రేడ్ అప్​డేట్’ పేరిట ఓ రిపోర్ట్ విడుదల చేసింది.

2021 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా వస్తుసేవల వాణిజ్య విలువ 4శాతం పెరిగిందని ఈ రిపోర్ట్ తెలిపింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 10శాతం పెరుగుదల అని పేర్కొంది. ముఖ్యంగా,2021 మొదట క్వార్టర్ లో ప్రపంచ వాణిజ్యం..కరోనా సంక్షోభానికి ముందు స్థాయిల కంటే ఎక్కువగా ఉంది, 2019 మొదటి క్వార్టర్ తో పోలిస్తే సుమారు 3 శాతం పెరిగిందని తెలిపింది. తూర్పు ఆసియా దేశాల బలమైన ఎగుమతి పనితీరుతో 2021 మొదటి క్వార్టర్ యొక్క వాణిజ్యం పుంజుకొన్నట్లు తెలిపింది. 2021 మొదటి క్వార్టర్ లో.. వస్తువుల వాణిజ్యం విలువ కరోనా మహమ్మారికి ముందు స్థాయి కంటే ఎక్కువగా ఉంది. అయితే సేవల వ్యాపారం సగటు కంటే తక్కువగా ఉంది. 2021 మొదటి త్రైమాసికంలో, COVID-19 సంబంధిత ఉత్పత్తుల ప్రపంచ వాణిజ్యం బలంగా ఉందని రిపోర్ట్ తెలిపింది.

2020 గణాంకాలతో పోలిస్తే.. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో భారత్​లో వస్తువుల దిగుమతులు 45 శాతం, సేవల దిగుమతులు 14 శాతం పెరిగాయని వెల్లడించింది. ఈ కాలంలో భారత్​ నుంచి వస్తువుల ఎగుమతి 26 శాతం, సేవల ఎగుమతి 2 శాతం అధికమైనట్లు స్పష్టం చేసింది. 2019 సగటుతో పోలిస్తే వస్తువుల దిగుమతులు 10శాతం, సేవల దిగుమతులు 2 శాతం పెరిగాయని వివరించింది. 2019 గణాంకాలతో పోలిస్తే వస్తువుల ఎగుమతులు 7శాతం పెరగ్గా.. సేవల ఎగుమతులు 3 శాతం తగ్గాయి. ఇక,2021 మొదటి క్వార్టర్ లో చైనా ఎగుమతులు..2020 సగటు మాత్రమే కాకుండా కరోనా పూర్వ స్థితి కన్నా కూడా మెరుగ్గా ఉన్నాయని రిపోర్ట్ పేర్కొంది.