India Corona : లక్ష దాటిన మరణాలు

India Corona : దేశవ్యాప్తంగా Corona మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనా మరణాలు ఇప్పటికే లక్ష దాటిపోయాయి. Unlock – 5లో ప్రవేశించి…కరోనా కంట్రోల్ అవుతుందనుకుంటున్న సమయంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా మళ్లీ ప్రతాపం చూపిస్తోంది. ప్రతి రోజూ వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.
మన దేశంలో మార్చి 11న కర్ణాటకలో తొలి కరోనా మరణం సంభవించింది. 205 రోజులు గడిచే సరికి కోవిడ్ మరణాలు లక్ష దాటిపోయాయి..ప్రపంచవ్యాప్తంగా మరణాలు ఇప్పటికే 10 లక్షలు దాటిన విషయం తెలిసిందే. ఈ లెక్కన ప్రపంచలోని ప్రతి 10 మరణాల్లో ఒకరు భారతీయులు ఉన్నారు. రికవరీ రేటు ఎక్కువగా ఉన్నా… వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.
ఇండియా (India) లో సెప్టెంబరులోనే కరోనాతో ఎక్కువ మంది చనిపోయారు. మొత్తం కేసుల్లో 41 శాతం కేసులు కూడా సెప్టెంబరులోనే నమోదయ్యాయి. సెప్టెంబరులోనే 33 వేల 255 మందిని మహమ్మారి బలితీసుకుంది. దేశం మొత్తం కరోనా మరణాల్లో ఇది 34 శాతంగా ఉంది.
ఆగస్టులో మొత్తం 28 వేల 859 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. ఆ రికార్డును సెప్టెంబరు అధిగమించింది. ఇండియాలో కరోనా ఉధృతి మొదలైన తర్వాత..సెప్టెంబర్‌లోనే అత్యధికంగా ప్రజలు కరోనా బారిన పడ్డారు. అన్‌లాక్‌లో భాగంగా కేంద్రం దాదాపు అన్ని రంగాలకి సడలింపులు ఇవ్వడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది.
ప్రజలు గుంపులు గుంపులుగా రొడ్డుపైకి వస్తున్నారు. చాలా మంది మాస్క్ ధరించడం లాంటి కనీస జాగ్రత్తలు కూడా పాటించడం మానేశారు. ఇక భౌతిక దూరం ఊసే లేదు. దీంతో సెప్టెంబర్‌లో కరోనా భారత్‌లో విజృంభించింది. గడిచిన అన్ని నెలలు ఒకలాగా ఉంటే.. సెప్టెంబర్ మాత్రం కరోనా కల్లోలాన్ని మిగిల్చింది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ (Coronavirus second wave) మొదలైనట్టే కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా రెండో దశలో ఉన్నట్టు అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కరోనాను కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయిందనుకున్న కేరళలో కోవిడ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రాజధాని తిరువనంతపురంతో పాటు అనేక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.
కరోనా కలకలం
జనవరి 30 : కేరళలో తొలి కరోనా కేసు. మార్చి 11 : కర్ణాటకలో తొలి కరోనా మరణం. మార్చి 15 : దేశవ్యాప్తంగా 100 కరోనా కేసులు. మార్చి 29 : దేశవ్యాప్తంగా 1000 కరోనా మరణాలు. మే 19 : దేశవ్యాప్తంగా లక్ష దాటిన కరోనా కేసులు. జూన్ 27 : దేశవ్యాప్తంగా 5 లక్షలు దాటిన కోవిడ్ కేసులు. జులై 6 : ప్రపంచ కరోనా కేసుల్లో భారత్ మూడోస్థానం. సెప్టెంబర్ 7 : ప్రపంచ కరోనా కేసుల్లో భారత్ రెండోస్థానం. అక్టోబర్ 3 : దేశ వ్యాప్తంగా లక్ష దాటిన కరోనా కేసులు.