India Space Station: 2035 నాటికి భారత్‌కు సొంతంగా అంతరిక్ష కేంద్రం.. 2040లో చంద్రుడిపైకి ఇండియన్
రాబోయే కాలంలో కీలక ప్రాజెక్టులతో అంతరిక్ష పరిశోధన, బయోటెక్నాలజీ, సముద్ర వనరుల అభివృద్ధిలో భారతదేశం సంచలనాత్మక మైలురాళ్లను సాధించడానికి సిద్ధమవుతోంది.

space station
India Own Space Station: రాబోయే కాలంలో కీలక ప్రాజెక్టులతో అంతరిక్ష పరిశోధన, బయోటెక్నాలజీ, సముద్ర వనరుల అభివృద్ధిలో భారతదేశం సంచలనాత్మక మైలురాళ్లను సాధించడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో 2035 నాటికి భారత్ సొంతంగా అంతరిక్ష స్టేషన్ ను ఏర్పాటు చేసుకోవటంతో పాటు.. 2040 నాటికి చంద్రునిపై భారతీయ వ్యోమగామిని దింపాలనే ప్రణాళికలు చేస్తోందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్ష మంత్రిత్వశాఖల మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని 1998లో ఏర్పాటు చేశారు. అందులో అమెరికా, రష్యా, జపాన్, కెనడా భాగస్వాములుగా ఉన్నాయి. చైనా ఇప్పటికే సొంతంగా అంతరిక్ష కేంద్రంగా ఏర్పాటు చేసుకుంది. 2035 నాటికి భారత్ కూడా సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.
Also Read: Cosmos 2553 : స్పేస్‌లో రష్యా రహస్య ఆయుధం ఎందుకు? టార్గెట్ ఎవరు?
కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ‘‘భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోనుంది. 2035 నాటికి దీని ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుంది. దీనిని భారత్ అంతరిక్ష స్టేషన్ అని పిలుస్తారు. అదేవిధంగా 2040 నాటికి చంద్రునిపై భారతీయులు కాలుమోపే అవకాశం ఉంటుంది. భారత వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపే మొదటి మానవ అంతరిక్ష యాత్ర గగన్ యాన్ కు భారతదేశం కూడా సిద్ధమవుతోంది. 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో భారతీయ వ్యోమగామి గగన్ యాన్ మిషన్ కింద అంతరిక్షంలోకి వెళ్తారు. ఈ మిషన్ భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధనల్లో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. మానవ అంతరిక్షయాన సామర్థ్యం కలిగిన దేశాల ర్యాంకులో భారత్ ను చేర్చుతుందని కేంద్ర మంత్రి తెలిపారు.
అంతరిక్ష పరిశోధన ప్రయత్నాలతోపాటు సముద్రపు లోతులను అన్వేషించడంపై కూడా దృష్టి పెట్టినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. భారత్ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్ ఓషన్ మిషన్ సముద్రయాన్ లో భాగంగా మత్స్య-6000 జలాంతర్గామిని రూపొందిస్తున్నట్లు, ఈ జలాంతర్గామిలో ముగ్గురు కూర్చొని సుమద్రంలో ఆరువేల కిలో మీటర్ల లోతుకు (ఇది సముద్రం గరిష్ట లోతు) చేరుకోవచ్చునని, తద్వారా సముద్ర వనరులు, జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయొచ్చునని తెలిపారు. ఇది ప్రారంభమైతే భారతదేశ మొట్టమొదటి మానవ సహిత సముద్ర అన్వేషణ మిషన్ గా గుర్తింపు దక్కనుంది. ఇదిలాఉంటే.. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో సముద్ర వనరులను అన్వేషించడం ప్రాముఖ్యతను గతంలో పలు సందర్భాల్లో ప్రస్తావించారు. దేశంలో విస్తారమైన సముద్ర భూభాగం ఉంది. సముద్రంలోని సంపదను సద్వినియోగం చేసుకోవటం, తద్వారా ఆర్థిక వృద్ధితో పాటు, పర్యావరణ స్థిరత్వంకు ప్రాధాన్యతను ఇవ్వడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని తెలిపారు.
ఎన్డీయేఏ ప్రభుత్వం హయాంలో ఉపగ్రహ ప్రయోగాల్లో భారత్ గణనీయమైన పురోగతిని సాధించినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. శ్రీహరికోట నుంచి మొదటి విదేశీ ఉపగ్రహ ప్రయోగం నుండి భారతదేశం మొత్తం 432 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించింది. వాటిలో 90శాతం ఉపగ్రహాలను గత దశాబ్దంలోనే ప్రయోగించామని కేంద్ర తెలిపారు. గత పదేళ్లలో ఐరాపా ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి పంపడం ద్వారా బారత్ 260 మిలియన్ యూరోలను ఆర్జించిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.