AK 203 Assault Rifles: నిమిషంలో 700 బుల్లెట్లు, 800 మీటర్ల రేంజ్.. ఏకే 203 రైఫిల్ ఖతర్నాక్ ఫీచర్లు.. మేడిన్ ఇండియా..

రూ.5,200 కోట్ల ఒప్పందం కింద ఈ కంపెనీ సాయుధ దళాలకు 6 లక్షలకు పైగా రైఫిళ్లను సరఫరా చేయాల్సి ఉంది.

AK 203 Assault Rifles: నిమిషంలో 700 బుల్లెట్లు, 800 మీటర్ల రేంజ్.. ఏకే 203 రైఫిల్ ఖతర్నాక్ ఫీచర్లు.. మేడిన్ ఇండియా..

Updated On : July 18, 2025 / 4:36 PM IST

AK 203 Assault Rifles: భారత సాయుధ దళాలు కొత్త బ్యాచ్ AK-203 అస్సాల్ట్ రైఫిల్స్‌ను పొందబోతున్నాయి. ఇది కలాష్నికోవ్ సిరీస్ ఆధునీకరించబడిన వెర్షన్. ఇది నిమిషంలో 700 రౌండ్ల వరకు కాల్పులు జరపగలదు. 800 మీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (IRRPL) అనేది AK-203 రైఫిల్స్ స్వదేశీ ఉత్పత్తి కోసం స్థాపించబడిన జాయింట్ వెంచర్ కంపెనీ. భారతదేశంలో దీన్ని ‘షేర్’ అని పిలుస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలో ఈ కంపెనీ స్థాపించబడింది.

రూ.5,200 కోట్ల ఒప్పందం కింద ఈ కంపెనీ సాయుధ దళాలకు 6 లక్షలకు పైగా రైఫిళ్లను సరఫరా చేయాల్సి ఉంది. డిసెంబర్ 2030 నాటికి డెలివరీలను పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు ఐఆర్‌ఆర్‌పిఎల్ చీఫ్ మేజర్ జనరల్ ఎస్‌కె శర్మ తెలిపారు.

“ఇప్పటివరకు దాదాపు 48వేల రైఫిల్స్ పంపిణీ చేయబడ్డాయి. రాబోయే రెండు, మూడు వారాల్లో మరో 7వేల రైఫిల్స్ అందజేయబడతాయి. ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి మరో 15వేల రైఫిల్స్ అందజేయబడతాయి” అని ఆయన మీడియాకు తెలిపారు. AK-47, AK-56 రైఫిల్స్‌తో పోలిస్తే AK-203 రైఫిల్స్ చాలా ఆధునికమైనవి. ఇవి కలాష్నికోవ్ సిరీస్‌లోని అత్యంత ప్రాణాంతకమైన రైఫిల్స్‌లో ఒకటి.

Also Read: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో.. ఎవరీ సీఈవో, ఎవరామె, ఏంటా వివాదం?

మూడు దశాబ్దాలకు పైగా సేవలందిస్తున్న ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్ (INSAS) రైఫిల్స్ స్థానంలో AK-203 రానుంది. ఇవి 7.62×39 mm కార్ట్రిడ్జ్ ఉండగా, INSAS 5.56×45 mm కార్ట్రిడ్జ్ కలిగి ఉంది. దీని మ్యాగజైన్‌లో ఒకేసారి 30 కార్ట్రిడ్జ్‌లను ఉంచొచ్చు. తిరుగుబాటు నిరోధక, ఉగ్రవాద నిరోధక చర్యల్లో భారత దళాల కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి రూపొందించబడిన ఈ రైఫిల్ బరువు దాదాపు 3.8 కిలోలు. కాగా, INSAS బరువు 4.15 కిలోలు. ‘షేర్’ రైఫిల్స్ బట్‌స్టాక్ లేకుండా 705 మి.మీ పొడవు ఉంటాయి. అయితే INSAS రైఫిల్స్ 960 మి.మీ పొడవు ఉంటాయి. నియంత్రణ రేఖ , వాస్తవ నియంత్రణ రేఖతో సహా ఉత్తర పశ్చిమ సరిహద్దుల వెంట మోహరించిన సైనికులకు ఇవి ప్రాథమిక అస్సాల్ట్ రైఫిల్‌గా మారతాయి.