సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో.. ఎవరీ సీఈవో, ఎవరామె, ఏంటా వివాదం?

ఆయనతో సన్నిహింగా గడిపిన మహిళ క్రిస్టిన్ క్యాబట్‌ చేతులతో ముఖాన్ని కప్పుకుని అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు.

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో.. ఎవరీ సీఈవో, ఎవరామె, ఏంటా వివాదం?

Updated On : July 18, 2025 / 3:46 PM IST

తమ కంపెనీ హెచ్‌ఆర్‌ హెడ్‌ క్రిస్టిన్ క్యాబట్‌తో “ఆస్ట్రోనమర్” సీఈవో ఆండీ బ్రయన్ సన్నిహితంగా గడుపుతూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు. తమ కంపెనీ ఉద్యోగి క్రిస్టిన్ క్యాబట్‌తో ఆండీ బ్రయన్ వ్యవహారం బయటపడటంతో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

తాజాగా, మసాచుసెట్స్‌లోని గిల్లెట్ స్టేడియంలో నిర్వహించిన ఓ కోల్డ్‌ప్లే కాన్సెర్ట్‌లో పాల్గొన్న ఆండీ బ్రయన్ తనతో ఉన్న క్రిస్టిన్ క్యాబట్‌తో రొమాంటిక్‌ మూడ్‌లో కనపడ్డ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. వారిద్దరు ఆ కాన్సెర్ట్‌లో సన్నిహితంగా గడుపుతున్న సమయంలో వారివైపునకు కెమెరా ఫోకస్ పడింది. దీంతో వెంటనే వాళ్లు ముఖాలు దాచుకునే ప్రయత్నం చేశారు.

కాన్సెర్ట్‌లో సింగర్ క్రిస్ మార్టిన్ ప్రేక్షకులతో మాట్లాడుతున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. స్క్రీన్‌పై కనపడిన వెంటనే ఆస్ట్రోనమర్ సీఈవో ఆండీ బ్రయన్ ముఖం దాచుకుని బారికేడ్ల వెనుకకు వెళ్లిపోయారు. ఆయనతో సన్నిహింగా గడిపిన మహిళ క్రిస్టిన్ క్యాబట్‌ చేతులతో ముఖాన్ని కప్పుకుని అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు.

ఈ ఘటనతో గిల్లెట్ స్టేడియంలో ఉన్న వారంతా నవ్వుకున్నారు. దీన్ని గమనించిన సింగర్ క్రిస్ మార్టిన్ మాట్లాడుతూ.. “ఓహ్ ఏమిటిది.. వీళ్లు చాలా సిగ్గుపడుతున్నారేమో” అని అన్నారు.

ఆండీ బ్రయన్ ఎవరు?
ఆండీ బ్రయన్ లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం 2023 జూలై నుంచి ఆస్ట్రోనమర్ సీఈఓగా ఉన్నారు. పబ్లిక్ రికార్డ్స్ ప్రకారం ఆయన భార్య పేరు మేగన్ కెరిగన్ బ్రయన్. ఇద్దరి వయసు 50. వారు నార్త్‌బరోలో నివసిస్తున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

న్యూస్‌వీక్ తెలిపిన వివరాల ప్రకారం ప్రైవేట్ డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టార్టప్ “ఆస్ట్రోనమర్” 2022లో యూనికార్న్ స్టేటస్‌కు చేరుకుంది. మొత్తం విలువ ఒక బిలియన్ డాలర్లు. ఇటీవల కంపెనీ ప్రధాన కార్యాలయం న్యూయార్క్ సిటీలోకి మార్చింది.

ఇక, 2023 ఆగస్టు వరకు ఆండీ బ్రయన్ లేస్‌వర్క్ సంస్థలో 2019 జూన్ నుంచి 2022 నవంబర్ వరకు ప్రెసిడెంట్‌గా, తర్వాత 2023 మే వరకు అడ్వైజర్‌గా ఉన్నారు. 2017 నుంచి 2019 వరకు సైబరీజన్ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్‌గా పనిచేశారు. అదనంగా ఫ్యూజ్ సంస్థలో ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా, వెరిసెంటర్, బీఎంసీ సాఫ్ట్‌వేర్ సంస్థలతో పనిచేశారు.

Also Read: ఇండియా కూటమికి బీటలు.. ఆ కూటమి నుంచి ఆప్ బయటకు వచ్చేసిందన్న సంజయ్‌ సింగ్‌.. రేపటి కీలక సమావేశానికి కూడా..

క్షమాపణలు చెప్పిన ఆండీ బ్రయన్
తన హెచ్ఆర్ డైరెక్టర్‌తో ఈ వ్యవహారం వీడియో వైరల్ అయిన తరువాత ఆండీ బ్రయన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ రాత్రి ఆనందంగా కాన్సెర్ట్‌ నిర్వహిస్తున్నారని, తాను వ్యక్తిగతంగా తప్పు చేసినట్లుగా ఆ వీడియో చూసిన వారు భావిస్తున్నారని అన్నారు. తన భార్య, కుటుంబం, ఆస్ట్రోనమర్ టీమ్‌కు హృదయపూర్వకంగా క్షమాపణ చెబుతున్నానని తెలిపారు.

సర్‌నేమ్ తొలగించుకున్న మేగన్ కెరిగన్ బ్రయన్
ఆండీ బ్రయన్, క్రిస్టిన్ క్యాబట్‌ వీడియో వైరల్ అయిన తర్వాత, ఆండీ భార్య మేగన్ కెరిగన్ బ్రయన్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పలు మార్పులు చేశారు. ఖాతాను ప్రైవేట్‌గా మార్చారు. ఆండీ ఫొటోలను తొలగించారు. కొందరు యూజర్లను బ్లాక్ చేశారు. మేగన్ అకౌంట్‌పై అనేక మంది కామెంట్లు పెడుతుండడంతో ఆమె ఈ చర్యలు తీసుకున్నారు. అలాగే, ఆమె తన సర్‌నేమ్‌ను కూడా తొలగించడ గమనార్హం.