మృత్యువుకు దగ్గరగా వెళ్లొచ్చాం..! గాల్లో ఉండగా భారీ కుదుపులకు లోనైన విమానం.. భయంతో కేకలు పెట్టిన ప్రయాణికులు.. వీడియోలు వైరల్

ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం ప్రతికూల వాతావరణం కారణంగా గాల్లో ఉండగానే భారీ కుదుపులకు లోనైంది. దీంతో విమానంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పెద్దగా కేకలు పెడుతూ..

మృత్యువుకు దగ్గరగా వెళ్లొచ్చాం..! గాల్లో ఉండగా భారీ కుదుపులకు లోనైన విమానం.. భయంతో కేకలు పెట్టిన ప్రయాణికులు.. వీడియోలు వైరల్

IndiGo Flight

Updated On : May 22, 2025 / 10:20 AM IST

IndiGo Flight: ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం ప్రతికూల వాతావరణం కారణంగా గాల్లో ఉండగానే భారీ కుదుపులకు లోనైంది. ఆ సమయంలో విమానంలో 200 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. దీంతో వారంతా భయాందోళనకు గురయ్యారు. పెద్దలు, చిన్నారులు కేకలు పెడుతూ గట్టిగా సీట్లను పట్టుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కూర్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

ఉత్తరాది రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారడంతో, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో తీవ్ర ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు బయలుదేరిన ఇండిగో విమానం ప్రతీకూల వాతావరణం కారణంగా గాల్లోనే తీవ్ర కుదుపులకు లోనైంది. వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించిన పైలట్, శ్రీనగర్ ఏటీసీకి సమాచారం ఇచ్చారు. దీంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు చర్యలు చేపట్టారు. చివరకు విమానం సురక్షితంగా దిగడంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.

విమానయాన సంస్థ ఎటువంటి నష్టాన్ని పేర్కొనలేదు. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో, ఫొటోల ప్రకారం.. విమానం ముందు భాగంలో భారీగా డ్యామేజ్ అయింది.

అయితే, శ్రీనగర్ కు వెళ్తున్న విమానంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల ప్రతినిధి బృందం ఉంది. డెరెక్ ఓ’బ్రెయిన్, నదిముల్ హక్, సాగరికా ఘోష్, మానస్ భూనియా, మమతా ఠాకూర్ లతో కూడిన ఐదుగురు సభ్యులు ఉన్నారు. ‘‘ఇది మరణానికి దగ్గరగా ఉన్న అనుభవం. నా జీవితం ముగిసిపోయిందని నేను అనుకున్నాను. ఆ సమయంలో విమానంలో ప్రయాణికులంతా బిగ్గరగా కేకలు పెట్టారు, ప్రార్థనలు చేశారు, భయాందోళనకు గురయ్యారు. మమ్మల్ని సురక్షితంగా తీసుకొచ్చిన పైలట్ కు అభినందనలు. మేము ల్యాండ్ అయినప్పుడు విమానం ముందు ముక్కు భాగం పగిలిపోయి ఉండటం చూశాము’’ అని సాగరికా ఘోష్ తెలిపారు. విమానం ల్యాండింగ్ తరువాత ప్రతినిధి బృందం పైలట్ కు కృతజ్ఙతలు తెలిపారు.

ఈ ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది.. ఢిల్లీ నుండి శ్రీనగర్‌కు బయలుదేరిన ఇండిగో విమానం 6E 2142 మార్గమధ్యలో అకస్మాత్తుగా వడగళ్ల వానను ఎదుర్కొంది. విమానం, క్యాబిన్ సిబ్బంది ప్రోటోకాల్‌ను పాటించారు. విమానం శ్రీనగర్‌లో సురక్షితంగా ల్యాండ్ అయిందని తెలిపింది.