Aditya L1: ఆదిత్య ఎల్1 గురించి ఇస్రో చీఫ్ కీలక ప్రకటన.. లగ్రాంజ్ పాయింట్ అంటే ఏమిటో తెలుసా?
భారతదేశపు తొలి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 విజయం దిశగా దూసుకెళ్తోంది. 2024 జనవరి 6న ఆదిత్య ఎల్1 తన గమ్యస్థానమైన లగ్రాంజ్ పాయింట్ వద్దకు చేరుకుంటుంది.

Aditya-L1
ISRO Chief Somanath : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అద్భుత విజయాలతో దూసుకెళ్తోంది. చంద్రయాన్ -3ని చంద్రుడిపై విజయవతంగా సాఫ్ట్ ల్యాండ్ చేయడంతో ప్రపంచం చూపును ఇస్రో తనవైపుకు తిప్పుకుంది. ఇప్పుడు ఇస్రో ఏ ప్రాజెక్ట్ చేపట్టినా ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనించే పరిస్థితి ఏర్పడింది. విజయాల పరంపరతో దూసుకెళ్తున్న ఇస్రో సెప్టెంబర్ 2న పీఎస్ఎల్వీ ఎక్స్ఎల్ సహాయంతో ఆదిత్య ఎల్1 మిషన్ ను ప్రయోగించింది. సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ఆదిత్య ఎల్1 లక్ష్యం. భారత్ తరపున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదే.
Also Read : ISRO Chandrayaan-3 : అరుదైన ఘనత సాధించిన ఇస్రో.. భూ కక్ష్యకు ప్రొపల్షన్ మాడ్యూల్ మళ్లింపు
ఇస్రో చీఫ్ కీలక ప్రకటన..
ఆదిత్య ఎల్1 గురించి ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ కీలక ప్రకటన చేశారు. వచ్చే నెల 6వ తేదీన ఆదిత్య ఎల్1 తన గమ్యస్థానమైన లగ్రాంజ్ పాయింట్ కు చేరుకుంటుందని అంచనా వేశామన్నారు. దీనికి సంబంధించిన కచ్చితమైన వివరాలను తగిన సమయంలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఆదిత్య ఎల్1 చేరుకోవాల్సిన గమ్య స్థానం భూమి నుంచి 15లక్షల కిలో మీటర్ల దూరంలో ఉంటుందని అన్నారు. ఆదిత్య ఎల్1 చేరుకునే ప్రాంతాన్ని లగ్రాంజ్ పాయింట్ అంటారని, అక్కడకు చేరుకున్న తరువాత మరోసారి ఇంజిన్ ను మండిస్తామని చెప్పారు. తర్వాత ఈ వ్యోమనౌక ఎల్1 కేంద్రంలో స్థిరపడుతుందని, ఆ తరువాత కక్ష్యలో పరిభ్రమిస్తూ అధ్యయనం మొదలు పెడుతుందని సోమనాథ్ తెలిపారు. ఐదేళ్ల పాటు భారత్ సహా ప్రపంచ దేశాలకు ఉపకరించే సమాచారాన్ని సేకరిస్తుందని, సూర్యుడిలో వచ్చే మార్పులు, అవి మన జీవనంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఆ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో చైర్మన్ తెలిపారు.
Also Read : ISRO: ఇస్రో దూకుడు.. మరో సరికొత్త ప్రయోగానికి ప్రణాళికలు.. 2040 కల్లా టార్గెట్ పూర్తిచేసేలా చర్యలు
లగ్రాంజ్ పాయింట్ అంటే ఏమిటి?
భారతదేశపు తొలి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 విజయం దిశగా దూసుకెళ్తోంది. 2024 జనవరి 6న ఆదిత్య ఎల్1 తన గమ్యస్థానమైన లగ్రాంజ్ పాయింట్ వద్దకు చేరుకుంటుంది. అయితే, లగ్రాంజ్ పాయింట్ అంటే ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది. లగ్రాంజ్ పాయింట్ అనేది అంతరిక్షంలో ఉన్న ప్రదేశం. భూమి, సూర్యుని యొక్క గురుత్వాకర్షణ ఒకదానికొకటి ఢీకొనే చోటు. భూమి, సూర్యుని మధ్య మొత్తం ఐదు లారెంట్ పాయింట్లు ఉన్నాయి. ఇస్రో పంపిన ఆదిత్య ఎల్1 భూమికి, సూర్యునికి మధ్య ఉన్న లగ్రాంజ్ పాయింట్-1కి వెళ్తుంది. దీనిని ఎల్1 అని పిలుస్తారు.