కర్ణాటకలో సీఎం జగన్ ఎఫెక్ట్…యడియూరప్ప నిర్ణయంపై విపక్షాలు సీరియస్

  • Published By: venkaiahnaidu ,Published On : August 27, 2019 / 07:22 AM IST
కర్ణాటకలో సీఎం జగన్ ఎఫెక్ట్…యడియూరప్ప నిర్ణయంపై విపక్షాలు సీరియస్

Updated On : August 27, 2019 / 7:22 AM IST

కర్ణాటక సీఎం యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. యడియూరప్ప కేబినెట్‌లోని 17మంది మంత్రులకు మంత్రులకు ఎట్టకేలకు శాఖలు లభించాయి. ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమిస్తున్నట్లు సోమవారం సాయం ఆయన చేసిన ప్రకటనపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. కర్ణాటక చరిత్రలో ఇప్పటివరకు ముగ్గురు డిప్యూటీ సీఎంలు లేరని,ఇది యడియూరప్ప తీసుకున్న నిర్ణయం కాదని,ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన డైరక్షన్ తోనే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ నాయకుడు ఇవాన్ డి సౌజ అన్నారు. మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కి ఏ మాత్రం ఆత్మగౌరం ఉన్నా ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. కేఎస్ ఈశ్వరప్ప,ఆర్ అశోక్ లు కూడా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే శాఖల కేటాయింపు విషయంలో ఎటువంటి బేదాభిప్రాయాలు లేవని ఇవాళ(ఆగస్టు-27,2019)బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ సీఎం యడియూరప్ప వ్యాఖ్యానించారు.

 కేఎస్ ఈశ్వరప్ప, జగదీష్ షెట్టర్, ఆర్ అశోక, శ్రీరాములు డిప్యూటీ సీఎం రేసులో ఉన్నారని కన్నడ రాజకీయవర్గాల్లో వార్తలు వినిపించినప్పటికీ అనూహ్యంగా గోవింద కారజోళ (దళిత), డాక్టర్‌ అశ్వర్థనారాయణ (ఒక్కళిగ), లక్ష్మణసవది (లింగాయత్‌) కి డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. ప్రజాపనులు, సాంఘిక సంక్షేమ శాఖలను కూడా డిప్యూటీ సీఎం గోవింద కారజోళకు కేటాయించగా, మరో డిప్యూటీ సీఎం డాక్టర్‌ అశ్వర్థనారాయణకు ఉన్నత విద్య, ఐటీబీటీ శాఖలను కేటాయించారు. ఇక మరో డిప్యూటీ సీఎం లక్ష్మణసవదికి  రవాణా శాఖను కేటాయించారు.  అయితే కర్ణాటక రాజకీయ పరిస్థితులతో పాటు ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం యొక్క ప్రభావం ఆ రాష్ట్ర కేబినెట్ కూర్పుపై పడిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కీలక సామాజికవర్గాలకు కేబినెట్‌లో ప్రాతినిథ్యం కల్పించడంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు మంత్రివర్గంలో సుముచిత స్థానం కల్పించాలనే యోచనతోనే బీజేపీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. 

బసవరాజు బొమ్మైకి హోం శాఖ దక్కింది. మాజీ సీఎం జగదీశ్‌ శెట్టర్‌కు భారీ, మధ్య తరహా పరిశ్రమలు, చక్కెర పరిశ్రమల శాఖ కేటాయించారు. కేఎస్ ఈశ్వరప్పకు గ్రామీణాభివృద్ధి,పంచాయితీ రాజ్ శాఖలు కేటాయించగా,ఆర్ అశోక్ కు రెవెన్యూ శాఖను కేటాయించారు. కేబినెట్ లో ఏకైక మహిళ అయిన శశికల జొల్లెకు మహిళ,శిశు సంక్షేమ శాఖను కేటాయించారు.  

సంకీర్ణ ప్రభుత్వం పతనం అనంతరం రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ కమలదళం కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సీఎంగా జగదీష్ శెట్టర్ అవుతారంటూ అంతకుముందు అనేక కథనాలు వినిపించినప్పటికీ వీటన్నింటికి చెక్ పెడుతూ జులై-26,2019న సీఎంగా యడియూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. అయితే సీఎంగా బాధ్యలత చేపట్టిన యడియూరప్ప కేబినెట్ ఏర్పాటుకు మూడు వారాల సమచయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 20వ  17 మంది మంత్రులు ప్రమాణం చేయగా, శాఖల కేటాయింపు మాత్రం ఇన్నాళ్లుగా పెండింగ్‌లో ఉంది.

ఇక మంత్రివర్గంలో చోటు దక్కని వారు కొందరు బహిరంగంగా ఆగ్రహం వెళ్లగక్కగా… మంత్రి పదవి వరించినవారు మంచి శాఖ కావాలని ప్రయత్నాలు సాగిస్తుండగా, అసలు పదవే లేనివారు కినుక వహించిన విషయం తెలిసిందే. అంతేగాకుండా రెండో విడతలో మంత్రి పదవి ఇస్తే సరి, లేని పక్షంలో ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధమని పలువురు ఎమ్మెల్యేలు సంకేతాలిచ్చారు.