Jagdeep Dhankhar: ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా.. కారణం ఏంటంటే..
పార్లమెంటు సభ్యులు తనపై చూపించిన ఆదరణ ఎప్పటికీ మరిచిపోలేను అని అన్నారు.

Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. అనారోగ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు జగదీప్ ధన్ ఖడ్. పదవీ కాలంలో తనకు సహకరించి, తనకు మద్దతుగా నిలిచినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నరేంద్ర మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు అందించిన సహకారం మరువలేనిదన్నారు. పార్లమెంటు సభ్యులు తనపై చూపించిన ఆదరణ ఎప్పటికీ మరిచిపోలేను అని అన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఉపరాష్ట్రపతిగా తాను పొందిన విలువైన అనుభవాలు మరువలేనివన్నారు జగదీప్ ధన్ ఖడ్.
2022 జూలై 16న ఉప రాష్ట్రపతిగా ధన్ ఖడ్ ఎన్నికయ్యారు. 2022 ఆగస్టు 11న ఆయన ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉంది. ఈలోగానే ధన్ ఖడ్ రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 1990-91 మధ్య ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. 2019-22 వరకు బెంగాల్ గవర్నర్ గా సేవలు అందించారు జగదీప్ ధన్ ఖడ్.
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాతో ఆ పదవి ఎవరికి దక్కుతుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా, త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయని, కాబట్టి ఆ రాష్ట్ర వ్యక్తికే పదవి దక్కే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాతో త్వరలో తదుపరి వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక ప్రక్రియ మొదలు కానుంది. కొత్తగా ఎన్నికయ్యే వారు పూర్తిగా ఐదేళ్ల పాటు పదవిలో ఉంటారు. నిబంధనల ప్రకారం వైస్ ప్రెసిడెంట్ పదవీ కాలం పూర్తైతే 60 రోజుల్లోగా ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. కనీసం 20 మంది ఎంపీలు ప్రతిపాదించిన వారే పోటీకి అర్హులు. ఈ పదవికి సంబంధించి ఎన్డీయే, ఇండియా కూటముల మధ్యే పోటీ ఉండనుంది.
ఉప రాష్ట్రపతి పదవికి ధన్ ఖడ్ రాజీనామా చేయడం కొంత సంచలనం సృష్టించింది. ప్రస్తుతం వర్షాకాల పార్లమెంట్ సమావేశం ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో ఆయన రాజీనామా నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది. తన రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చేలా చూడాలని రాష్ట్రపతికి పంపిన లేఖలో కోరారు ధన్ ఖడ్. ఆయన తన జీవితంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే.. పదవికి రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాజ్యసభలో కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఉప రాష్ట్రపతిని ఎన్నుకోవడంతో పాటు ఇతర అంశాలపై కసరత్తు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ సమావేశాల వరకు ఉప రాష్ట్రపతిగా ధన్ ఖడ్ కొనసాగాలని కేంద్రం కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.