పార్లమెంట్ వద్ద 144 సెక్షన్ : జేఎన్‌యూ విద్యార్థుల లాంగ్ మార్చ్

  • Published By: madhu ,Published On : November 18, 2019 / 07:04 AM IST
పార్లమెంట్ వద్ద 144 సెక్షన్ : జేఎన్‌యూ విద్యార్థుల లాంగ్ మార్చ్

Updated On : November 18, 2019 / 7:04 AM IST

దేశ రాజధానిలో జేఎన్‌యూ విద్యార్థులు కదం తొక్కారు. వారి నినాదాలు, డప్పులు, పాటలతో దద్దరిల్లిపోయింది. భారీ సంఖ్యలో విద్యార్థులు పార్లమెంట్ వరకు లాంగ్ మార్చ్ నిర్వహించారు. ప్ల క్లార్డులు ప్రదర్శిస్తూ..ర్యాలీగా వెళుతున్నారు. పార్లమెంట్ ముట్టడికి విద్యార్థి సంఘాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లకుండా మోహరించారు. నిరసనలు తెలియచేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని, అందుకే పార్లమెంట్ ముట్టడికి బయలుదేరామని విద్యార్థి సంఘాలు వెల్లడిస్తున్నాయి. పార్లమెంట్ వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 

హాస్టల్ ఫీజులు పెంచుతున్నట్లు యూనివర్సిటీ అధికారులు ప్రకటించడంతో జవహర్ లాల్ నెహ్రూ యూనవర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థులు కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వ విద్యను కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మెస్ ఛార్జీలు కూడా పెంచారని, డ్రెస్ కోడ్ విషయంలో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వెల్లడిస్తున్నారు. ఇటీవలే జేఎన్‌యూను విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. వీరిని అదుపు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు.

తీవ్ర వాగ్వాదం..ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. తమ సమస్యలు పరిష్కారం కావాలంటే పార్లమెంట్ ముట్టడి చేయాలని సంఘాలు భావించాయి. పార్లమెంట్ ఆవరణలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మరి వీరు పార్లమెంట్ ముట్టడి చేస్తారా ? పోలీసులు అడ్డుకుంటారా ? కేంద్రం తగిన విధంగా స్పందిస్తుందా ? అనేది చూడాలి. 
Read More : లోక్ సభ సమావేశాలు : విపక్షాల ఆందోళన..గందరగోళం