ఏడేళ్ల ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ : నిర్భయకు న్యాయం జరిగింది

  • Published By: madhu ,Published On : March 20, 2020 / 12:38 AM IST
ఏడేళ్ల ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ : నిర్భయకు న్యాయం జరిగింది

Updated On : March 20, 2020 / 12:38 AM IST

నిర్భయకు న్యాయం జరిగింది. ఆమె తల్లిదండ్రుల ఏడేళ్ల ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ పడింది. ఉరిని తప్పించుకునేందుకు ఆఖరి క్షణం వరకు దోషులు ఆడిన డ్రామాలు ఫలితాన్నివవ్వలేదు. కొద్దిగంటల ముందు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉరిపై స్టే ఇవ్వాలన్న దోషుల అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చడం, ఆపై సుప్రీంకోర్టు వెళ్లినా చావుదెబ్బ తగలడంతో ఎట్టకేలకు నలుగురూ ఉరి కంభానికి వేలాడారు. 

నలుగురు దోషులకు ఉరి : – 
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో శిక్ష నుంచి తప్పించుకోవడానికి దోషులు చేసిన చివరి ప్రయత్నం కూడా విఫలమైంది. ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన స్టే పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టిపారేయడంతో నలుగురు దోషులు ముకేశ్ కుమార్, పవన్‌ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్‌ని ఉరితీశారు. నాలుగో డెత్‌ వారెంట్ మేరకు వారికి 2020, మార్చి 20వ తేదీ శుక్రవారం ఉదయం 5.30 గంటలకు శిక్షను అమలు చేశారు.

నాలుగో డెత్ వారెంట్ :- 
మూడుసార్లు డెత్‌ వారెంట్‌ జారీ అయినా రకరకాల కారణాలను సాకుగా చూపి ఉరిశిక్ష నుంచి తప్పించుకున్న నలుగురు దోషులు… నాలుగో డెత్‌ వారెంట్‌ నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. ఇంతవరకు చట్టంలోని లొసుగులను తమకు అనుకూలంగా మలుచుకొని వంతుల వారీగా న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకున్నారు. క్యూరేటివ్ పిటిషన్, క్షమాభిక్ష పిటిషన్, రివ్యూ పిటిషన్లను ఒక్కొక్కరుగా దాఖలు చేస్తూ శిక్షను ఆలస్యం చేశారు. మూడుసార్లు డెత్ వారంట్ జారీ చేసినప్పటికీ మరణ శిక్షను వాయిదా వేయించగలిగారు. నాలుగో డెత్‌ వారెంట్ జారీ అయ్యాక కూడా అదే పని చేశారు. ఆఖరి గడియల్లో అదే ఉద్దేశంతో ఢిల్లీ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఉరి కంభానికి వేలాడక తప్పలేదు.

సంతోషం వ్యక్తం చేసిన నిర్భయ తల్లిదండ్రులు : – 
ఏడేళ్ల తర్వాత నిర్భయకు న్యాయం జరిగిందన్నారు ఆమె తల్లి ఆశాదేవి. మార్చి 20వ తేదీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దోషులు ఎన్నికుట్రలు పన్నినా న్యాయవ్యవస్థ ముందు అవన్నీ పనిచేయలేదన్నారు. నలుగురు దోషుల ఉరిపై ఆమె హర్షం వ్యక్తంచేశారు. ఇది దేశ మహిళలందరికీ దక్కిన న్యాయమని.. ఇందుకుగాను రాష్ట్రపతికి, న్యాయవస్థకు ధన్యావాదాలు తెలిపారు. నలుగురు దోషులను ఉరి తీయడంపై నిర్భయ తండ్రి హర్షం వ్యక్తంచేశారు. ఏడేళ్ల తర్వాత తన ముఖంపై నిజమైన సంతోషపు ఛాయలు కనిపిస్తున్నాయన్నారు. దోషులకు ఉరిపడేలా సహకరించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

More News On Nirbhaya Case Convicts:

న్యాయం జరిగింది.. దేశ చరిత్రలో ఇదే తొలిసారి.. అరగంటపాటు ఉరి కొయ్యలకే!

వాళ్లు రేపటి సూర్యున్ని చూడలేరు..: ఆఖరి అవకాశం అయిపోయింది.. ఇక ఉరే!

జైలు లాక్‌డౌన్‌: నిర్భయ దోషుల ఉరికి ఏర్పాట్లు పూర్తి