అయ్యప్ప గుడిలోకి వెళ్తావా : కనకదుర్గ తలపగలకొట్టిన అత్త

  • Published By: veegamteam ,Published On : January 15, 2019 / 07:31 AM IST
అయ్యప్ప గుడిలోకి వెళ్తావా : కనకదుర్గ తలపగలకొట్టిన అత్త

Updated On : January 15, 2019 / 7:31 AM IST

కేరళ: హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించిన ఇద్దరు మహిళల్లో ఒకరైన కనకదుర్గపై స్వయంగా అత్త దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. 2019, జనవరి 14వ తేదీ సోమవారం కనకదుర్గ అత్తింటికి వెళ్లింది. కోడలిని చూడగానే అత్త కోపంతో ఊగిపోయింది. అయ్యప్ప ఆలయంలోకి ఎందుకు వెళ్లావ్? అంటూ కోడలిని నిలదీసింది. అదే ఆవేశంలో కోడలిపై కర్రతో దాడి చేసింది. ఆమె తలపై బలంగా మోదింది. ఈ దాడిలో కనకదుర్గ తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను మల్లాపురం జిల్లాలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

2019, జనవరి 2వ తేదీన తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో కనకదుర్గ (39), బిందు అమ్మిని (40) శబరిమల అయ్యప్ప సన్నిధానంలోకి ప్రవేశించారు. అన్ని వయసుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత 50ఏళ్ల వయసులోపు ఉన్న మహిళలు ఆలయంలోకి వెళ్లడం ఇదే తొలిసారి. దీంతో ఆలయం అపవిత్రమైందంటూ గుడి తలుపులు మూసేసిన పూజారులు సంప్రోక్షణ అనంతరం తలుపులు తెరిచారు. కనకదుర్గ, బిందుల ప్రవేశం వివాదానికి దారితీసింది.

హిందూ సంప్రదాయాలను గౌరవించే తమ కుటుంబంలోని మహిళ ఆలయం ప్రవేశించిందంటే నమ్మలేకున్నానని, దీని వెనుక బలమైన కుట్రే ఉందని అప్పట్లో కనకదుర్గ సోదరుడు అన్నారు. తన సోదరిని భయపెట్టి ఆలయానికి తీసుకెళ్లి ఉంటారని, ప్రస్తుతం ఆమె ఆచూకీ తెలియడం లేదని కూడా చెప్పారు. కనకదుర్గ ప్రాణాలకు ముప్పుకూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. కోజికోడ్‌లోని కనకదుర్గ ఇంటి ముందు నిరసనలు కూడా జరిగాయి. దీంతో బిందు, కనకదుర్గ రెండు వారాలుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తమకు బెదిరింపులు వస్తున్నాయని, అధికారులు తమకు తగిన భద్రత కల్పించాలని కోరారు. రెండు వారాల అజ్ఞాతంలోకి వెళ్లిన కనకదుర్గ ఇటీవలే ఇంటికి చేరింది. ఇంతలో ఈ ఘటన జరిగింది.