Kangana Ranaut : లోక్‌సభ ఎన్నికల బరిలో కంగనా రనౌత్..? క్లారిటీ ఇచ్చేసిన బాలీవుడ్ బామ
కంగనా రాజకీయాల్లోకి వస్తున్నారని కొద్దికాలంగా ప్రచారం జరుగుతుంది.. తాజాగా ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చింది.

Kangana Ranaut
Lok Sabha Elections 2024: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అనగానే కంగనా రనౌత్ పేరు ముందుగా గుర్తుకొస్తుంది. ఆమె అప్పుడప్పుడూ రాజకీయాలపైనా తన అభిప్రాయాలను వెల్లడిస్తూ వచ్చింది. అయితే, అవి వివాదాస్పదంగానూ మారిన సందర్భాలున్నాయి. వివిధ సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వానికి ఆమె అనుకూలంగా మాట్లాడుతూ వచ్చారు. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ క్రమంలో కంగనా రాజకీయాల్లోకి వస్తున్నారని కొద్దికాలంగా ప్రచారం జరుగుతుంది.. తాజాగా ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చింది.

Actor Kangana Ranaut
ద్వారకలోని శ్రీకృష్ణుడి ఆలయాన్ని ఆమె సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో రాజకీయ రంగప్రవేశంపై మీడియా ఆమెను ప్రశ్నించగా.. భగవాన్ శ్రీకృష్ణుడు ఆశీర్వాదం ఉంటే పోటీ చేస్తానని చెప్పింది. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టను సాధ్యం చేసినందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కంగనా ప్రశంసించారు. బీజేపీ ప్రభుత్వం చేసిన కృషితో సుదీర్ఘ పోరాటం తర్వాత భారతీయులమైన మనం ఈరోజును చూడగలిగాం. ఎంతో వైభవంగా ఆలయాన్ని నిర్మాణం చేస్తున్నారు అని కంగనా అన్నారు.

Kangana Ranaut
నా వరకూ కృష్ణుడి ద్వారక ఒక స్వర్గంలాంటిది. నేనెప్పుడూ ఇక్కడికి వచ్చి వీలైనంత వరకు భగవంతుని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. నాకు పనినుండి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా నేను వస్తాను అని పేర్కొంది. నీట మునిగిన ద్వారకను పైనుంచి చూసినా కనపడుతుంది. కానీ, నీటి అడుగు భాగానికి వెళ్లి ఆ నాటి గుర్తులను చూసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మం ప్రపంచమంతా రెపరెపలాడాలని పేర్కొన్నారు.

Kangana Ranaut
కంగనా రనౌత్ దర్శకత్వం వహించి, నిర్మించిన ఎమర్జెన్సీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కనిపిస్తుంది. ఆమె దీని తరువాత ‘తను వెడ్స్ మను పార్ట్ 3’ సినిమాలో నటించనున్నారు. ఇటీవల ఆమె నటించిన ‘తేజస్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయింది.