Bharat Jodo Yatra : రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జూడో యాత్ర’తో కాంగ్రెస్ రాత మారేనా? పార్టీకి పూర్వ వైభవం వచ్చేనా?
కన్యాకుమారి టు కశ్మీర్. 12 రాష్ట్రాలు.. 2 కేంద్రపాలిత ప్రాంతాలు.3571 కిలోమీటర్ల రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఈ ‘భారత్ జూడో యాత్ర’తో కాంగ్రెస్ రాత మారేనా? పార్టీకి పూర్వ వైభవం వచ్చేనా? అనే చర్చ జరుగుతోంది.

Rahul gandhi Bharat Jodo Yatra
Rahul gandhi Bharat Jodo Yatra : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర కాంగ్రెస్ నేతల్లో భారీ ఆశల్ని రేకెత్తిస్తోంది. కార్యకర్తల్లో జోష్ నింపుతోంది. అంతేకాదు నాయకుడిగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి రాహుల్ గాంధీది.వెరసి రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేలకిలోమీటర్ల పాదయాత్ర మొదలుపెట్టారు. ఎన్నికల్లో వరుస పరాజయాలు. కీలక నేతల పార్టీనుంచి వెళ్లిపోవటం..అంతర్గత కుమ్ములాటలతో జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ కు పూర్వవైభవం తేవటానికి రాహుల్ ఈ జూడో యాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్ కు నూతన జవసత్వాలు అందించే సత్తా రాహుల్ గాంధీకి ఉందా? ఆయన చేపట్టిన భారత్ జూడో యాత్రతో కాంగ్రెస్ రాత మారుతుందా?
కన్యాకుమారి టు కశ్మీర్. 12 రాష్ట్రాలు.. 2 కేంద్రపాలిత ప్రాంతాలు.3571 కిలోమీటర్ల రాహుల్ పాదయాత్ర. 2024లో గెలుపే లక్ష్యంగా యువరాజు అడుగులు వేశారు. కాంగ్రెస్ యువరాజు రాహుల్‌గాంధీ ప్రజల్లోకి వెళ్తున్నారు. భారత్ జోడో పేరుతో పాదయాత్ర మొదలుపెట్టారు. ఐదు నెలల పాటు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ యాత్ర కొనసాగుతుంది. మొత్తం 12 రాష్ట్రాల్లో, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్ని కవర్ చేస్తూ.. 68 లోక్‌సభ స్థానాలు, 203 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 3 వేల 571 కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతున్నారు రాహుల్. ఆయన యాత్రపై కాంగ్రెస్ భారీ ఆశలే పెట్టుకుంది. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి.. ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతున్న వేళ రాహుల్ యాత్ర పార్టీకి పునరుత్తేజం తెస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కోవాల్సి ఉంది. రాహుల్ యాత్రతో పార్టీకి ఎంతమేర ప్రయోజనం చేకూరుతుందన్న దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.
Also read : Bharat Jodo Yatra : కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు .. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభం
80 ఏళ్ల క్రితం మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన.. సెప్టెంబర్ 7 నుంచే రాహుల్ భారత్ జోడో యాత్ర మొదలుపెట్టారు. 117మంది కాంగ్రెస్ నాయకులతో కలిసి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ ఐదు నెలలు పాదయాత్ర చేయనున్నారు. దేశంలో పెరుగుతున్న మతోన్మాదం, అసహన రాజకీయాల్ని ప్రస్తావించడంతో పాటు జీవనోపాధిని నాశనం చేసే ఆర్థిక వ్యవస్థలకు ప్రత్యామ్నాయం చూపాలని భావిస్తోంది కాంగ్రెస్. రైతు వ్యతిరేక చట్టాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రైవేటీకరణ లాంటి అంశాల్ని వివరిస్తూ ప్రజల్లోకి చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించబోతున్నారు రాహుల్‌గాంధీ.
రాహుల్ యాత్ర ప్రతి రోజూ రెండు జట్లుగా సాగుతుంది. ఉదయం ఏడు నుంచి పదిన్నర మధ్య ఒక టీమ్.. సాయంత్రం మూడున్నర నుంచి ఆరున్నర మధ్య రెండో టీమ్ కదులుతాయి. రాహుల్ వెంట నడిచేవారిని భారత్ యాత్రీలు, స్థానిక కార్యకర్తల్ని ప్రదేశ్ యాత్రీలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పాల్గొనేవారిని అతిథి యాత్రీలుగా వర్గీకరించారు. నిత్యం సగటున 22 కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతున్నారు రాహుల్. ఈనెల 11న కేరళలో ప్రవేశిస్తుంది. 18 రోజులపాటు ఆ రాష్ట్రంలో సాగి.. 30వ తేదీన కర్ణాటకలో అడుగుపెడుతుంది. అక్కడ 21 రోజులపాటు నడుస్తారు. కన్యాకుమారి నుంచి తిరువనంతపురం, కొచ్చి, నీలాంబర్, మైసూరు, బళ్లారి, రాయచూరు, వికారాబాద్, నాందేడ్, జల్గావ్, ఇండోర్, కోట, దౌసా, ఆల్వార్, బులంద్ శహర్, ఢిల్లీ, అంబాలా, పఠాన్‌కోట్, జమ్ము.. చివరగా శ్రీనగర్ చేరుకుంటారు.
Also read : Ashok Gehlot warns bjp: ఇలాగైతే భారత్‌లో అంతర్యుద్ధం వస్తుంది: సీఎం అశోక్ గహ్లోత్ వార్నింగ్
పాదయాత్రలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోనూ రాహుల్‌గాంధీ పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజుల పాటు వంద కిలోమీటర్లు నడుస్తారు. రాయదుర్గం, ఆలూరు, ఆదోని, మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఆయన యాత్ర సాగుతుంది. మరోవైపు తెలంగాణలోనూ రాహుల్ యాత్ర కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. రాష్ట్రంలో ఆయన 350 కిలోమీటర్ల మేర నడవబోతున్నారు. బీజేపీ హయాంలో అంబానీ, అదానీకి తప్పించి.. మధ్య తరగతి ప్రజలకు లాభం లేదని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలు.. రాహుల్ పాదయాత్రతో ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళ్తాయని ధీమాగా చెప్తున్నారు.
భారత రాజకీయాల్లో రాహుల్ గాంధీకి వున్న విలువేంటో అందరికీ తెలుసు. రాజీవ్, సోనియా ముద్దుల కొడుకు కావడం మినహా ఆయనకంటూ ప్రత్యేకత ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీలో తలపండిన నాయకులెందరో వున్నారు. వారెవరితోనూ పోల్చగలిగే స్థాయి ఆయనకు లేదని అంటారు. కనీసం.. కాంగ్రెస్ పార్టీలోని సామాన్య కార్యకర్తకు వున్నంత రాజకీయ పరిజ్ఞానం కూడా రాహుల్‌కు లేదన్న విమర్శలున్నాయి. అందుకు తగ్గట్టే.. చాలాసార్లు రాహుల్ రాజకీయ అపరిపక్వతను నిరూపించుకున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న బీజేపీ.. ఆయన్ను ప్రజల ముందు ఒక మొద్దబ్బాయిగా ప్రొజెక్ట్ చేసి సక్సెస్ అయింది. తన మీద ఇలాంటి ముద్ర వుందని తెలిసినప్పటికీ రాహుల్ గాంధీ దానిని తొలగించుకునే ప్రయత్నం చేయకపోగా.. తన మాటలు, చేతలతో ఆ ముద్ర మరింత బలపడేలా చేసుకుంటున్నారు.
Also read : Bharat Jodo Yatra : రాహుల్ చేయాల్సింది భారత్ జోడో యాత్ర కాదు .. ‘అఖండ భారత్’ కోసం యాత్ర చేయాలి’ : అసోం సీఎం
గ్రాండ్ ఓల్డ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేతికి అందివచ్చినా రాహుల్‌గాంధీ తిరస్కరించారు. నా వల్ల కాదు బాబోయ్ అంటూ చేతులెత్తేశారు. రాహుల్ చేసిన పనితో అనారోగ్యంతో బాధపడుతూనే పార్టీని నడిపిస్తున్నారు సోనియాగాంధీ. రాహుల్ చర్యలు ఊహాతీతమన్న సెటైర్లు ఎప్పట్నుంచో ఉన్నాయి. ఆమధ్య పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకుండా సెలవు తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయారు. అంతకుముందు కీలక రాష్ట్రాల ఎన్నికల సమయంలోనూ కనిపించకుండా అజ్ఞాతంలో ఉన్నారు. దాంతో ప్రత్యర్థి పార్టీలన్నీ రాహుల్ గాంధీ కనిపించట్లేదంటూ కామెడీ చేసే పరిస్థితి వచ్చింది. యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఆర్టినెన్స్‌ని చించిపారేయడంతో పాటు అనేక విషయాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వినిపించాయి. ఇప్పుడు కూడా.. రాహుల్ పాదయాత్రపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏం జరిగినా క్షణాల్లో ప్రపంచానికి తెలిసిపోయే టెక్నాలజీ యుగంలో.. నెలల తరబడి సాగే పాదయాత్ర లాంటి భారీ కార్యక్రమాలతో ఉపయోగం ఉండదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో దేశంలో పాదయాత్ర చేసిన నాయకులు కూడా పెద్దగా కనిపించరు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ అడుగులు కరెక్టేనా? పాదయాత్రతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలం పెరుగుతుందా? కార్యకర్తల్లో రాహుల్ నాయకత్వంపై విశ్వాసం కలుతుందా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా జనాన్ని ఏకం చేయడంలో ఆయన సక్సెస్ అవుతారా? రాహుల్ వ్యక్తిగత ఇమేజ్‌తో పాటు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుందా?