Ballari : బళ్లారిలో టెన్షన్ టెన్షన్.. మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం..
Ballari : కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో రాత్రి నుంచి హైటెన్షన్ వాతావరణ నెలకొంది. మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది.
Gali Janardhan Reddy
- బళ్లారిలో ఉద్రిక్తత వాతావరణం
- ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం
- గాలి జనార్దన్ రెడ్డి టార్గెట్‌గా కాల్పులు.. తప్పించుకున్న మాజీ మంత్రి
- ఒకరు మృతి… పోలీసుల పటిష్ఠ బందోబస్తు
Ballari : కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గురువారం రాత్రి బళ్లారిలో హవంబావి ప్రాంతంలోని ఆయన ఇంటి వద్దే బళ్లారి నగర ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీశ్ రెడ్డి కాల్పులు జరిపాడు. అయితే, జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ఈ ఘటనతో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
బళ్లారిలోని ఎస్పీ సర్కిల్‌లో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఈనెల 3వ తేదీన ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. అయితే, నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు కడుతున్నారు. ఈ క్రమంలోనే గాలి జనార్దన్ రెడ్డి, భరత్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణకు దారితీసింది.
జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద బళ్లారి నగర ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీశ్ రెడ్డి ఫ్లెక్సీలు కట్టిస్తున్నాడు. దీంతో జనార్దన్ రెడ్డి అనుచరులు అడ్డు చెప్పడంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలోనే గంగావతి నుంచి జనార్దన్ రెడ్డి బళ్లారి ఇంటికి చేరుకున్నాడు. ఆయన్ను చూసి సతీశ్ రెడ్డి, తన అనుచరులు రెచ్చిపోయారు. ఫ్లెక్సీలు కట్టేందుకు సతీశ్ రెడ్డి, ఆయన అనుచరులు ప్రయత్నం చేయడంతో జనార్దన్ రెడ్డి వర్గీయులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ క్రమంలో కొందరికి గాయాలయ్యాయి.
పోలీసులు ఘటన స్థలికి చేరుకొని ఇరు వర్గీయులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కానీ, రాళ్లు, బీరు సీసాలతో ఇరువర్గీయులు దాడులకు పాల్పడ్డారు. దీంతో ఎస్పీ ఆదేశాలతో గుంపును చెదరగొట్టేందుకు ఇద్దరి గన్‌మెన్‌లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో సతీశ్ రెడ్డి ఓ గన్‌మెన్ వద్ద తుపాకీ లాక్కొని జనార్దన్ రెడ్డివైపు రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. జనార్దన్ రెడ్డి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
ఇదే సమయంలో ఇరువర్గీయులు కాల్పులకు దిగడంతో భరత్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించినట్లు తెలిసింది. సతీశ్ రెడ్డికి కూడా బుల్లెట్ గాయమైంది. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఆస్పత్రికి తరలించారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు పెద్దెత్తున రంగంలోకిదిగి పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఈ ఘటనపై గాలి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనపై కాల్పులు జరపగా.. పక్కనే పడిపోయిన బుల్లెట్ ను ఆయన మీడియాకు చూపించారు. వాల్మీకి విగ్రహం ఏర్పాటు పేరుతో భరత్ రెడ్డి అనవసర రాద్దాంతం చేస్తున్నాడని అన్నారు. ఎమ్మెల్యే భరత్ రెడ్డి, అతడి నాన్న సూర్యనారాయణ రెడ్డి, సతీశ్ రెడ్డి లాంటి చిల్లర రౌడీలకు భయపడేది లేదని జనార్దన్ రెడ్డి పేర్కొన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ నాయకులను, ముఖ్యంగా తనను టార్గెట్ చేసి హత్య చేయించాలని కుట్ర పన్నుతున్నారని జనార్దన్ రెడ్డి ఆరోపించాడు.
బళ్లారి నగర ఎమ్మెల్యే భరత్ రెడ్డి మాట్లాడుతూ.. బళ్లారి నగరంలో వాల్మీకి విగ్రహం ప్రతిష్టను శాంతియుతంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం జరిగితే వారికి భవిష్యత్తు ఉండదని కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కావాలనే గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు ఘర్షణకు దిగారని భరత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై చట్టపరంగా ముందుకెళ్తామని ఆయన పేర్కొన్నారు.
