కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పారు..కర్ణాటక ఫలితాలపై మోడీ

కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పారని ప్రధాని మోడీ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్,జేడీఎస్ పార్టీలు ప్రజాతీర్పును వెన్నుపోటు పొడిచాయని, ఇప్పుడు ఆ పార్టీలు గుణపాఠం నేర్చుకున్నాయన్నారు. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలతో ప్రజా తీర్పును అవమానించినవారికి ప్రజాస్వామిక పద్ధతిలో ఓటర్ల నుంచి సమాధానం దొరికిందని మోడీ అన్నారు.
జార్ఖండ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా హజారీబాగ్‌లో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో సోమవారం(డిసెంబర్-9,2019)పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో గ్రెస్-జేడీఎస్ కూటమికి ఎదురైన పరాభవాన్ని ప్రస్తావించారు. ప్రజాతీర్పును కాంగ్రెస్ పార్టీ అక్రమంగా దోచేసిందని, అందుకే ఇప్పుడు మళ్లీ ప్రజలు కర్నాటకలో బీజేపీని గెలిపించారని మోడీ అన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసిందని, బీజేపీనే స్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తుందన్నారు. దక్షిణ భారత దేశంలో బీజేపీ పాత్ర స్వల్పమే అన్న వారికి ఇది చెంపపెట్టు అని మోడీ అన్నారు. ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ఎవరు నడుచుకున్నా, ప్రజలను అవమానిస్తున్నట్లేనని, అలాంటివారికి ప్రజలు అంతిమంగా బుద్ధి చెబుతారని అన్నారు. ఇవాళ వెలుబడిన ఉప ఎన్నికల ఫలితాల్లో గెలిచినవారిలో 11 మంది అనర్హత ఎమ్మెల్యేలే ఉన్నారు.
కర్ణాటకలోని 15 శాసన సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. 12 స్థానాల్లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. రెండింటిలో కాంగ్రెస్ విజయం సాధించగా, ఓ స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. మరోవైపు ఇవాళ కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ దూకుడును చూసి కాంగ్రెస్,జేడీఎస్ కార్యకర్తలు నాయకులు షాక్ అవడం మొదలుపెట్టారు. మరోవైపు ఉప ఎన్నికల ఫలితాలను పూర్తిగా ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటింకముందే కన్నడ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత పదవికి మాజీ సీఎం సిద్దరామయ్య రాజీనామా చేశారు. ప్రజల తీర్పుని తాము గౌరవిస్తున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండురావ్ కూడా తన పదవికి రాజీనామా చేశారు.