Karnataka Cabinet Expansion : కర్ణాటకలో కొలువుదీరిన కొత్త కేబినెట్..యడియూరప్ప కుమారుడికి నిరాశ
కర్ణాటక నూతన మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది.

Cabinet
Karnataka Cabinet Expansion కర్ణాటక నూతన మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది. ఇవాళ బెంగళూరులోని రాజ్ భవన్ లో గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్.. కేబినెట్లో చోటు దక్కించుకున్న 29 మంది సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు.
కాగా, అనుభవజ్ఞులు, యువకుల కలబోతతో కొత్త కేబినెట్‌ను రూపొందించినట్లు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. ఏడుగురు ఓబీసీలు, ముగ్గురు ఎస్సీలు, ఏడుగురు ఒక్కలిగలు, 8 మంది లింగాయత్‌లు, ఓ ఎస్టీ, ఓ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించినట్లు తెలిపారు. ఓ మహిళను సైతం కేబినెట్లోకి తీసుకున్నట్లు చెప్పారు. పాలనను మెరుగుపర్చడం సహా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మార్గనిర్దేశనంతో కేబినెట్ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రులుగా ఎవరినీ ఎంపిక చేయలేదని తెలిపారు.
అయితే, కేబినెట్ కూర్పులో మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు నిరాశే మిగిలింది. యడుయూరప్ప కుమారుడు విజయేంద్రకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించినా అలా జరగలేదు. యడియూరప్ప సహా ఆయన అనుచరులు విజయేంద్రకు మంత్రి పదవి దక్కేలా చివరి క్షణం వరకూ శతవిధాలా ప్రయత్నించారు. కానీ, హైకమాండ్ విజయేంద్రకు మంత్రి పదవి ఇచ్చేందుకు నిరాకరించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీఎం పదవికి గట్టి పోటీ అనుకున్న అర్వింద్ బెల్లాడ్కు సైతం ఎలాంటి పదవీ దక్కలేదు.