కార్తీక పూజలు : శివాలయాల్లో భక్తుల రద్దీ

రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా శ్రీశైలం, శ్రీకాళహస్తి, త్రిలింగ క్షేత్రాలతో పాటు ఇంద్రకీలాద్రి భక్తులతో నిండిపోయింది. అసలైతే సోమవారం (అక్టోబర్ 28, 2019)న ప్రారంభం కావాల్సింది.. కానీ సూర్యోదయం వేళ అమావాస్య ఘడియలు ఉండటంతో, నేటి నుంచి కార్తీకమాసం మొదలైనట్టు పంచాంగకర్తలు వెల్లడించారు.
ఇక శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం నుంచే భక్తుల రద్దీ పెరిగింది. కార్తీకమాసం ప్రారంభం కావడంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ ప్రాంగణంలో మార్పులు చేశారు. అధిక సంఖ్యలో సామూహిక అభిషేకాలు, కుంకుమార్చనలు తదితర పూజలను నిర్వహించారు.
అంతేకాదు ఆలయం ముందు, ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. మరోవైపు శ్రీకాళహస్తిలోనూ ఇదే విధమైన నిర్ణయాలు తీసుకున్నారు. సోమ, శని, ఆది వారాల్లో సేవలను రద్దు చేస్తున్నామని అధికారులు తెలిపారు.