కేరళలో అక్రమ కట్టడాల కూల్చివేత

కేరళలోని మరాడు మున్సిపాల్టీలో అక్రమంగా నిర్మించిన అయిదు భారీ లగ్జరీ అపార్ట్‌మెంట్ల కూల్చివేత శనివారం, జనవరి11న ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 11 గంటలకు మరాడు ఫ్లాట్లను ధ్వంసం చేశారు. హోలీ ఫెయిత్ బిల్డింగ్‌ను పేలుడు పదార్థాలతో కూల్చేశారు. రేపు ఆదివారం కూడా కూల్చివేతలు కొనసాగనున్నాయి. కొచ్చి తీర ప్రాంతంలో అక్రమంగా బిల్డింగ్‌లు నిర్మించినట్లు మరాడు సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అపార్టమెంట్ల కూల్చి వేత ప్రక్రియ కొద్ది సెకన్లలోనే ముగిసి పోయింది. మరాడు అపార్ట్ మెంట్ల కూల్చివేతను తిలకించటానికి వేలాదిగా ప్రజలు సమీపంలోని రోడ్లపైనా, అపార్టమెంట్లపైనా చేరుకుని కూల్చివేతను ప్రత్యక్షంగా చూశారు.
కేరళ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ఆధ్వర్యంలో కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. అపార్ట్ మెంట్లు కూల్చివేతకు సుమారు 800 కిలోల పేలుడు పదార్ధాలు వాడినట్లు తెలుస్తోంది. ఆల్ఫా సెరీన్ బిల్డింగ్‌ను కూడా కూల్చనున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత.. రియల్ ఎస్టేట్ మాఫియాకు చెంప పెట్టు అని భావిస్తున్నారు. పర్యావరణ ఆంక్షలను ఉల్లంఘించి.. బిల్డింగ్‌ను నిర్మిస్తే ఇలాగే ఉంటుందన్నారు.
కేరళ ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే కూల్చివేత జరగాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఆ అపార్ట్‌మెంట్లలోని ప్రతి ఒక ఫ్లాట్ ఓనర్‌కు 25 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. బిల్డింగ్‌ల కూల్చివేత, నష్టపరిహారం అందే విధంగా చూసుకునేందుకు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
బిల్డింగ్‌లను కూల్చివేసేందుకు వస్తున్న మున్సిపాల్టీ అధికారులను అడ్డుకోవాలని కోరుతూ మరాడు అపార్ట్‌మెంట్లలో ఉంటున్న సుమారు 400 కుటుంబాలు ఇటీవలే రాష్ట్రపతిని కూడా ఆశ్రయించారు. దీని కోసం వారంతా లేఖలు కూడా రాశారు. కేరళలోని 140 మంది ఎమ్మెల్యేలు కూడా మరాడు బిల్డింగ్ ఓనర్లకు అండగా ఉన్నారు. కానీ సుప్రీం కోర్టు మాత్రం ఆ నిర్మాణాలను కూల్చివేయాలని స్పష్టం చేసింది. కొచ్చి సమీపంలో ఉన్న మరాడులో నిర్మించిన బిల్డింగ్‌లు కోస్టల్ జోన్ డెవలప్‌మెంట్ నియమావళిని ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
#WATCH Maradu flats demolition: H2O Holy Faith apartment tower demolished through controlled implosion #Kerala pic.twitter.com/fKbciLGH14
— ANI (@ANI) January 11, 2020