Krishnagiri MP Gopinath : తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళనాడు కృష్ణగిరి ఎంపీ గోపీనాథ్

Krishnagiri MP Gopinath : పార్లమెంటులో ప్రమాణ స్వీకారోత్సవంలో తమిళనాడులోని కృష్ణగిరి కాంగ్రెస్ ఎంపీ గోపీనాథ్ తమిళంలో కాకుండా తెలుగులో ప్రమాణం చేశారు. రాజ్యాంగం ప్రతిని చేతిలో పట్టుకుని తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.

Krishnagiri MP Gopinath : తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళనాడు కృష్ణగిరి ఎంపీ గోపీనాథ్

krishnagiri congress mp gopinath ( Image Source : Google )

Krishnagiri MP Gopinath : తమిళనాడులోని కృష్ణగిరి లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన గోపీనాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన వారందరూ పార్లమెంటులో ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు, పుదుచ్చేరిలో గెలిచిన 40 మంది ఎంపీలు ఇవాళ (మంగళవారం) రెండో రోజు ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపీలతో ప్రమాణం స్వీకారం చేయిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2.15 గంటలకు తమిళనాడు ఎంపీలు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్, డీఎంకే సహా డీఎంకే కూటమికి చెందిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.

గతంలో అసెంబ్లీలోనూ తెలుగులోనే ప్రమాణం :
ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో కృష్ణగిరి కాంగ్రెస్ ఎంపీ గోపీనాథ్ తమిళంలో కాకుండా తెలుగులో ప్రమాణం చేశారు. రాజ్యాంగం ప్రతిని చేతిలో పట్టుకుని గోపీనాథ్‌ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత తమిళంలో థాంక్యూ… జై తమిళనాడు అని అన్నారు. తమిళనాడు ఎంపీలంతా ఈరోజు తమిళంలో ప్రమాణ స్వీకారం చేయగా, గోపీనాథ్ మాత్రం తెలుగులో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.

గతంలో తమిళనాడు అసెంబ్లీకి పలుమార్లు గోపీనాథ్ ఎన్నికయ్యారు. అసెంబ్లీలో కూడా తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయడంతోపాటు పలు అంశాలపై గోపీనాథ్‌ మాట్లాడారు. అప్పట్లో తమిళనాడు అసెంబ్లీలో గోపీనాథ్‌ అడిగిన ప్రశ్నకు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా తెలుగులోనే సమాధానం ఇచ్చారు.
.
ఏఐఏడీఎంకే అభ్యర్థిపై గెలిచిన గోపీనాథ్ :
లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణగిరి కాంగ్రెస్ ఎంపీ గోపీనాథ్‌కు 4 లక్షల 92 వేల 883 ఓట్లు వచ్చాయి. ఆయనపై పోటీ చేసిన ఏఐఏడీఎంకే అభ్యర్థి జయప్రకాష్‌కు 3 లక్షల 397 ఓట్లు వచ్చాయి. తద్వారా గోపీనాథ్ కృష్ణగిరి నియోజకవర్గంలో 1,92,486 ఓట్ల తేడాతో జయప్రకాశ్‌పై విజయం సాధించారు. ఇక ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి నరసింహన్ 2 లక్షల 14 వేల 125 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు.

Read Also : కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. వచ్చీ రాగానే ముందుగా ఎక్కడికి వెళ్లారో, ఏం చేశారో తెలుసా..

నామ్ తమిళ్ అభ్యర్థి వీరప్పన్ కుమార్తె విద్యారాణి 1,07,083 ఓట్లు సాధించి 4వ స్థానంలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో నోటాకు 10,983 ఓట్లు వచ్చాయి. కాగా, కృష్ణగిరి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని దగ్గరగా ఉంటుంది. తమిళుల తర్వాత అత్యధికంగా తెలుగు వారితో పాటు కన్నడవారు ఈ కృష్ణగిరిలోనే ఉన్నారు.