ప్రతిపక్ష నేతగా రాహుల్‌ లోక్‌సభలో మోదీని ఢీకొట్టగలరా?

అటు కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తూనే ఇటు.. కన్యాకుమారీ టు కశ్మీర్‌ వరకు..

ప్రతిపక్ష నేతగా రాహుల్‌ లోక్‌సభలో మోదీని ఢీకొట్టగలరా?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి మాట్లాడుకోవాలంటే.. 2019కి ముందు.. ఆ తర్వాత.. ఇదే కరెక్ట్‌ టైమ్ లైన్‌. సరిగ్గా ఐదేళ్ల క్రితం కాంగ్రెస్‌ ఘోర ఓటమి తర్వాత..రాహుల్‌లోని లీడర్‌ బయటికి వచ్చాడు. నడిపించే నాయకుడిగా.. నిలబడి పోరాడే ధీరుడిగా ఇటు ప్రజల్లో.. అటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో నమ్మకం కలిగించారు రాహుల్ గాంధీ.

ప్రజల్లో కాంగ్రెస్‌పై సానుకూలత తీసుకొచ్చేందుకు ఎంతో మెచ్యూరిటీ ఉన్న లీడర్‌గా ప్రవర్తిస్తూ వచ్చారు. ఎంతసేపు ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ చేసిన అభివృద్ధిని మాత్రమే చెప్పకుండా.. తాము పవర్‌లోకి వస్తే ఏం చేస్తామనే దానిపై ప్రజల్లో ఓ భరోసా కల్పించే ప్రయత్నం చేశారాయన. 2019 తర్వాత యూపీలో బీజేపీ బంపర్‌ మెజార్టీతో గెలవడం కాంగ్రెస్‌కు ఇబ్బంది అయింది.

కాంగ్రెస్‌లో జోష్‌ అప్పటినుంచే..
ఆ తర్వాత మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ఎన్నికల్లో హస్తం పార్టీ అధికారాన్ని కోల్పోయింది. తర్వాత గుజరాత్‌ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో పోరాడినా అధికారంలోకి రాలేకపోయింది. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌లో జోష్‌ నింపాయి. అక్కడ కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సమయంలో విపక్ష నేతలంతా ఒకే స్టేజ్‌పై కనిపించేలా ప్లాన్ చేశారు రాహుల్. ఆ తర్వాత బెంగళూరు, పాట్నాలో జరిగిన మీటింగ్‌లలో ఇండియా కూటమి ఏర్పాటుకు అడుగులు పడ్డాయి.

అటు కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తూనే ఇటు.. కన్యాకుమారీ టు కశ్మీర్‌ వరకు మొదటి విడత భారత్‌ జోడో యాత్ర చేశారు. ఆ తర్వాత న్యాయ్‌ యాత్ర పేరుతో దేశాన్ని చుట్టేశారు రాహుల్. సామాన్యులతో కలసి మాట్లాడటం. పేదల కష్టాలు తెలుసుకోవడం..తెర వెనక చీకటి బతుకులను చూసి చలించిపోవడం వంటివి రాహుల్‌ను నాయకుడిగా మార్చేశాయి.

జోడోయాత్ర తర్వాత రాహుల్‌లో చాలా మార్పు వచ్చిందని చెప్పొచ్చు. అధికారం కంటే పేదోళ్లు బాగుపడాలి.. దేశ దశదిశా మారాలనే తపన ఆయనలో కనిపించింది. లక్షల మంది ఆకలితో అలమటిస్తుంటే.. బీజేపీ విద్వేష పూరిత రాజకీయాలు చేస్తుందని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు రాహుల్.

నార్త్ స్టేట్స్‌లో కీలకంగా ఉన్న రిజర్వేషన్ల అంశాన్ని లీడ్‌ పాయింట్‌గా తీసుకుని జనాల్లోకి వెళ్లారు. సేమ్‌టైమ్‌ కులగణన చేస్తామని రాహుల్ హామీ ఇవ్వడం కూడా ఇండియా కూటమికి ప్లస్ అయింది. ఇక అగ్నిపథ్ స్కీమ్‌ రద్దు చేస్తామని చెప్పడం కూడా యూపీ, బీహార్ లాంటి స్టేట్స్‌లో కాంగ్రెస్‌కు కలసి వచ్చింది. దీంతోపాటు అట్రాక్టివ్‌ మ్యానిఫెస్టోతో జనాల్ని తమవైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు రాహుల్ గాంధీ. అలా తనదైన మార్క్‌తో దేశ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు.

విపక్షాలన్నీ ఏకతాటిపైకి..
లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి.. తిరుగులేని శక్తిగా ఉన్న బీజేపీని 242 సీట్ల దగ్గరే ఆపడంతోనే విజయం సాధించినంత పేరు తెచ్చుకున్నారు రాహుల్‌. చార్ సౌ పార్ అంటూ బీజేపీ చేసిన ప్రచారం.. దేశ ప్రజల్లో హాట్ టాపిక్ అయింది. మూడోసారి మోదీనే పీఎం అని.. కాంగ్రెస్‌ విపక్షాలు వందలోపు సీట్లకే పరిమితం అవుతాయన్న చర్చ జరిగింది. కట్‌ చేస్తే బీజేపీకి 242.. ఎన్డీయే కూటమి మొత్తం కలిపి 294 సీట్లు సాధించింది. ఇది ఓ రకంగా బీజేపీకి ఓడి గెలిచినంత పని అయింది.

బీజేపీ, ఎన్డీయేను కట్టడి చేసేందుకు ఎంత తగ్గాల్లో అంత కంటే ఎక్కువే తగ్గాడు రాహుల్. మిత్రపక్షాలు అడిగినన్ని సీట్లు ఇచ్చేశారు రాహుల్. 543 ఎంపీ స్థానాలు ఉంటే.. 328 సీట్లలో మాత్రమే పోటీ చేసింది కాంగ్రెస్. అంటే ఇంకో 215 సీట్ల వరకు మిత్రపక్షాలకు త్యాగం చేశారు రాహుల్ గాంధీ. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ అఖిలేష్‌ యాదవ్‌కు కోరుకున్న సీట్లు ఇచ్చింది కాంగ్రెస్.

అందుకు బీజేపీకి కుంభస్థలం లాంటి యూపీలో సగం సీట్లు సాధించేలా వ్యూహ రచన చేశారు రాహుల్. తర్వాత ఆమ్‌ ఆద్మీ పార్టీతో పాటు.. తమిళనాడులో డీఎంకే స్టాలిన్‌తో ఫ్రెండ్లీ రిలేషన్ కంటిన్యూ చేశారు. అందుకే తమిళనాట కూటమి 39కి 39 సీట్లతో క్లీన్ స్వీప్ చేయగలిగింది.

నాలుగు మెట్లు దిగి..
పొత్తులతో పార్టీకి నష్టం జరుగుతుందని.. తమ క్యాడర్‌, లీడర్లు ఇబ్బందిపడుతారని రాహుల్‌కు తెలుసు. కానీ సింగిల్‌గా వెళ్లి..ఓట్ల చీలికతో మోదీని దించలేమని.. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకతాటిపైకి తెచ్చారు. సింగిల్ లైన్‌ ఎజెండా బీజేపీని ఓడించడమే లక్ష్యంగా అందరినీ కలుపుకుని ముందుకెళ్లారు. ఒక మెట్టు కాదు..నాలుగు మెట్లు దిగి సీట్లు త్యాగం చేశారు రాహుల్. ఫైనల్‌గా 240కి పైగా సీట్లు సాధించి.. కాంగ్రెస్‌కు 99 సీట్లు గెలిపించడంలో కీరోల్‌ ప్లే చేశారు.

ఇప్పుడు ఎన్డీయే కూటమికి కంటిమీద కునుకు లేకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇందులో ఆయన పదేళ్ల కష్టం ఉంది. ఒక్కోరోజు నాలుగైదు రాష్ట్రాలు. ఆరేడు మీటింగ్‌లతో.. నిత్యం ప్రజల్లో ఉంటూ వచ్చారు రాహుల్. అందుకే ప్రజలు ఆయన్ను ఆదరించారు. ఇప్పుడు ఎన్డీయే కూటమిని ఢీకొట్టేలా లోక్‌సభలో విపక్ష నేత అయ్యారు. ఇండియా కూటమి నేతలు కూడా రాహుల్ శ్రమను, పట్టుదలను పరిగణలోకి తీసుకునే ఆయననే అపోజిషన్ లీడర్‌గా ఎన్నుకున్నారు.

Also Read: రాజకీయ సముద్రంలో ఎదురీది నిలబడ్డ రాహుల్‌.. తండ్రి, తల్లి తర్వాత అపోజిషన్ లీడర్‌గా యువనేత