Kumbh Mela Covid Test Scam : రెండు ప్రైవేట్ ల్యాబ్స్,ఓ సంస్థపై కేసు నమోదు
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సమయంలో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో రెండు నెలల క్రితం నిర్వహించిన మహ కుంభమేళా స్నానాలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

Kumbh Mela Covid Test Scam
Kumbh Mela Covid Test Scam కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సమయంలో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో రెండు నెలల క్రితం నిర్వహించిన మహ కుంభమేళా స్నానాలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. కుంభమేళా స్నానాల్లో పాల్గొన్న వేల మందికి కోవిడ్ సోకినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే కుంభమేళా సమయంలో నిర్వహించిన కరోనా టెస్టుల్లో భారీగా అవకతవకలు జరిగాయని.. సుమారు ఒక లక్ష మందికి కరోనా ఫేక్ రిపోర్ట్‌లను ఇచ్చిన అంశం ఇటీవల వెలుగులోకి వచ్చింది.
కుంభమేళా సమయంలో రోజూ 50 వేల కోవిడ్ టెస్టులు చేయాలని ఉత్తరాఖండ్ హైకోర్టు చెప్పడంతో ఆ టార్గెట్ ను రీచ్ అవడానికి ప్రైవేట్ ల్యాబ్ లు.. టెస్టులు చేయకుండానే చేసినట్టు డేటా ఎంటర్ చేసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో దీనిపై హరిద్వార్ జిల్లా యంత్రాంగం ఈ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది. కొవిడ్ టెస్టుల కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న ‘మాక్స్ కార్పొరేట్ సర్వీసెస్’ అనే ప్రైవేట్ ఏజెన్సీ సహా కొన్ని ప్రైవేట్ ల్యాబ్ లు ఈ వ్యవహారానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఆరోగ్యశాఖ కూడా దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలో గురువారం నగర్ కొత్వాలీ పోలీస్ స్టేషన్ లో ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ ఫిర్యాదు మేరకు రెండు ప్రైవేట్ ల్యాబ్‌లతోపాటు మాక్స్ కార్పొరేట్ ఏజెన్సీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మాక్స్ కార్పొరేట్ ఏజెన్సీతో పాటు లాల్‌చందాని ల్యాబ్స్, నల్వా ల్యాబ్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడంతో వీటిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు హరిద్వార్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ సెంథిల్ అబుదై కృష్ణరాజ్ తెలిపారు. మరోవైపు, కుంభమేళా కరోనా టెస్టింగ్ స్కామ్ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం తీరథ్ సింగ్ రావత్ హెచ్చరించారు.