“మహా ప్రభుత్వం” ఐదేళ్లు కొనసాగేనా? : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి …ఒకరు రాజీనామా

మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ ఇప్పుడు కొత్త మిత్రపక్షాల మధ్య విబేధాలకు దారితీసినట్లు తెలుస్తోంది. కేబినెట్ లో బెర్త్ దక్కకపోవడం పలువురు కాంగ్రెస్,సేన,ఎన్సీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. సీనియర్ కాంగ్రెస్ లీడర్,మాజీ సీఎం పృధ్వీరాజ్ చవాన్ కూడా కేబినెట్ విస్తరణపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
పార్టీకి విధేయులుగా ఉన్న తమను విస్మరించారంటూ ఆరుగరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చవాన్,ససీమ్ ఖాన్, ప్రణితి షిండే,సంగ్రమ్ తోప్టే,అమిన్ పటేల్,రోహిదాస్ పాటిల్ గత రాత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లిఖార్జున ఖర్గేతో సమావేశమై తన ఆవేదనను వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్సీపీలో కూడా అలకలు మొదలయ్యాయి. ఎన్సీపీ సీనియర్ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకి ఇప్పటికే తన రాజీనామా ప్రకటించారు. ప్రస్తుత రాజకీయాలకు తాను సరిపోనని ఆయన తెలిపారు. దీంతో మహావికాస్ అగాడి ప్రభుత్వంలో తిరుగుబాటు ప్రారంభమైందని స్పష్టమవుతోంది.
శివసేన ముఖ్య నాయకుడు సంజయ్ రౌత్ కూడా కేబినెట్ విస్తరణ పట్ట అసంతృప్తిగా ఉన్నట్లు అర్థమవుతోంది. సోమవారం మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి ఆయన హాజరుకాలేదు. ఆయన తమ్ముడు, ఎమ్మెల్యే సునీల్ రౌత్‌కు మంత్రివర్గంలో చోటు లభించక పోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. బీజేపీకి, శివసేనకు మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు తలెత్తిన సమయంలో సంజయ్ రౌత్ కీలకంగా వ్యవహరించి ఎన్సీపీ-కాంగ్రెస్ లతో శివసేన ప్రభుత్వ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహిచిన విషయం తెలిసిందే. ఇంతటి కీలక వ్యక్తి ప్రమాణ స్వీకారానికి గైర్హాజర్ కావడంతో మహా రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
ఇదిలా ఉండగా సోమవారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని కలిశారు. సీనియర్ లీడర్ మల్లిఖార్జున ఖర్గే,కేసీ వేణుగోపాల్ కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు.