మే3 వరకు లాక్‌డౌన్, ఏప్రిల్ 20వ తేదీ తర్వాత సడలింపులు: మోడీ

ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్‌ను మే 3వ తదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దేశంలో కరోనా మహమ్మారి ప్రతాపం రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో ఈ కఠిన నిర్ణయం తీసుకోకతప్పదని ప్రకటించారు ప్రధాని మోడీ.
ఈ లాక్‌డౌన్ వల్లే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చునని అన్నారు మోడీ. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అందరూ సహనం వహించారని, భారత రాజ్యాంగ పీఠికలోని ‘భారత ప్రజలమైన మేము’ అన్న స్ఫూర్తిని దేశప్రజలు చాటారని అన్నారు. దేశంలో 500 కేసులు ఉన్నప్పుడే లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నామని ఆయన గుర్తు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితులు బట్టి చూస్తే మనం అనుసరిస్తున్న మార్గం సరైనదేనని మరో 19రోజులు పొడగింపు నిర్ణయానికి మద్దతు తెలపాలని అన్నారు. అయితే కరోనా హాట్ స్పాట్లు కాని ప్రాంతాల్లో ఏప్రిల్ 20వ తేదీ తర్వాత సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. అయితే కేసులు పెరగకపోతే మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంటామని అన్నారు.