“లాంగ్ లివ్ క్రిటిక్స్” అంటూ విజయ్‌కు కౌంటర్ ఇచ్చిన సీఎం స్టాలిన్
స్టాలిన్ ఇవాళ చెన్నైలోని కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.

సినీనటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు విజయ్ ఇటీవల తమిళనాడు ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తిప్పికొట్టారు. ఇటీవల విజయ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కొందరికి ప్రయోజనాలు చేకూర్చడానికే తమిళనాడులో శాంతిభద్రతలకు కావాల్సినంతగా ప్రాధాన్యం ఇవ్వట్లేదని ఆరోపించిన విషయం తెలిసిందే.
అలాగే, డీఎంకే గత ఎన్నికల మ్యానిఫెస్టోను అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతోనే ఇచ్చారని, అది అసత్యాలతో నిండిపోయిందని ఆయన ఆరోపించారు. దీనిపైనే స్టాలిన్ ఇవాళ చెన్నైలోని కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో స్పందించారు.
“ప్రజలకు మా ప్రభుత్వం ఏమీ చేయలేదని కొందరు అంటున్నారు. మేము ఇచ్చిన హామీలను నెరవేర్చాం. మిగిలిన ఒకటి, రెండు హామీలను త్వరలోనే అమలు చేస్తాం. కొత్త పార్టీలను స్థాపించే వారు డీఎంకేను నాశనం చేయాలని కోరుకుంటున్నారు. మా ప్రభుత్వం నాలుగేళ్లుగా సాధించిన విజయాల గురించి ఆలోచించాలని వారికి చెప్పాలనుకుంటున్నాను.
అన్నాదురై ఒకే ఒక లైన్‌లో ఇటువంటి వారి గురించి చెప్పేవారు. అదే “లాంగ్ లివ్ క్రిటిక్స్” (విమర్శకులు సంపూర్ణ ఆయుష్షుతో జీవించాలి) అని చెప్పేవారు. నేను కూడా ఇదే చెప్పాలనుకుంటున్నాను. నేను విమర్శల గురించి పట్టించుకోను. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయడమే మా లక్ష్యం. అనవసరంగా ఎవరికీ స్పందించాల్సిన అవసరం లేదు” అని స్టాలిన్ అన్నారు.
Kamala Harris: డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ కుటుంబ నేపథ్యం.. రాజకీయ ప్రస్థానం