లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి దెబ్బ.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ రాజీనామా

మహారాష్ట్రలో బీజేపీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తన పదవికి రాజీనామా చేశారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి దెబ్బ.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ రాజీనామా

Devendra Fadnavis Resign: లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో మహారాష్ట్ర బీజేపీలో ముసలం రేగింది. మహారాష్ట్రలో బీజేపీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తన పదవికి రాజీనామా చేశారు. “మహారాష్ట్రలో మాకు జరిగిన నష్టానికి నేనే పూర్తి బాధ్యత వహిస్తా. నన్ను మంత్రి పదవి నుంచి తప్పించాలని అగ్ర నాయకత్వాన్ని కోరుతున్నాను. నేను పారిపోయే వ్యక్తిని కాదు. కొత్త వ్యూహం సిద్ధం చేసుకున్న తర్వాత ప్రజల్లోకి వెళ్తామ”ని ఫడ్నవీస్‌ ప్రకటించారు. ముస్లింల ఓట్లు, మరాఠా ఉద్యమం కారణంగానే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం జరిగిందని అభిప్రాయపడ్డారు.

దేవేంద్ర ఫడ్నవీస్‌ రాజీనామా ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఫడ్నవీస్‌ బాధ్యత వహించారని, ఇంతకుమంచి ఏమీ లేదని.. ప్రభుత్వంలో ఆయన కొనసాగుతారని మంత్రి గిరీశ్ మహాజన్ అన్నారు. ఫడ్నవీస్‌ రాజీనామా చేసే ప్రశ్నలేదని.. 200 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారని, తమ ప్రభుత్వానికి ఎలాంటి సమస్య లేదన్నారు. కాగా, ఫడ్నవీస్‌ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే కోరారు. ప్రభుత్వంలో కొనసాగుతూనే పార్టీ బలోపేతానికి పనిచేయాలని సూచించారు. ఆయన రాజీనామాను హైకమాండ్ ఆమోదించబోదన్నారు.

బీజేపీ అంతర్గత విషయం: వాడెట్టివార్
ఫడ్నవీస్‌ రాజీనామా అంశం బీజేపీ అంతర్గత విషయమని దానిపై తాము మాట్లాడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నాయకుడు, శాసనసభలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ అన్నారు. మహారాష్ట్రలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని.. బీజేపీని ప్రజలు తిరస్కరించారని తెలిపారు. ఫడ్నవీస్‌ రాజీనామా చేస్తే బీజేపీ హైకమాండ్ చూసుకుంటుందన్నారు. రాష్ట బీజేపీ అగ్ర నాయకుడిగా ఆ పార్టీ విజయాలకు క్రెడిట్ తీసుకుంటే.. ఓటమికి ఆయన బాధ్యత వహించాల్సిందేనని అన్నారు.

Also Read: ప్రధాని పదవికి మోదీ రాజీనామా.. ఆమోదించిన రాష్ట్రపతి.. అప్పటివరకూ ఆపద్ధర్మ ప్రధానిగానే!

చంద్రశేఖర్ బవాన్కులే రాజీనామా!
దేవేంద్ర ఫడ్నవిస్ నాయకత్వంలో బీజేపీ తీవ్రంగా నష్టపోయిందని శివసేన (యుబీటీ) నాయకురాలు సుష్మా అంధారే వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి బాధ్యత వహించి ఆయన రాజీనామా చేయాలనుకున్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు. దేవేంద్ర ఫడ్నవిస్ మళ్లీ మహారాష్ట్రకు ముఖ్యమంత్రి కాలేరని, ఆయన బదులుగా వినోద్ తావ్డే గురించి బీజేపీ ఆలోచించాలని సూచించారు.

Also Read: లోక్‌సభ ఫలితాల తర్వాత.. నితీశ్ కుమార్‌పై సోషల్ మీడియాలో హోరెత్తుతున్న మీమ్స్.. ఎందుకంటే?