అయోధ్య తీర్పు: ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్

  • Published By: vamsi ,Published On : November 9, 2019 / 03:13 AM IST
అయోధ్య తీర్పు: ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్

Updated On : November 9, 2019 / 3:13 AM IST

అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు అంతిమ తీర్పు ఇవ్వనుంది. ఈ మేరకు ఇప్పటికే దేశమంతా హై అలర్ట్ ప్రకటించింది కేంద్రం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇవ్వనుండగా.. ఉదయం 10గంటల 30నిమిషాలకు తీర్పు ఇవ్వనున్నారు. ఈ క్రమంలోనే ఉద్రేకపరిచే విధంగా, రెచ్చగొట్టే సందేశాలు ఇస్తే మాత్రం వారిని వెంటనే అరెస్ట్ చేసే విధంగా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే శాంతిభద్రతల దృష్ట్యా సోషల్ మీడియాను కూడా కంట్రోల్‌లోకి తీసుకుంది కేంద్రం.

శతాబ్ధాలుగా హిందువులు, ముస్లింల మధ్య వివాదానికి కారణమైన అయోధ్య భూమి విషయంలో ఎట్టకేలకు అంతిమ తీర్పు రానుండగా.. లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో అయోధ్యపై అభ్యంతరకరమైన పోస్ట్ చేసిన 56 ఏళ్ల వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేశారు పోలీసులు. ధూలేలోని ఓల్డ్ ఆగ్రా రోడ్‌లో నివసిస్తున్న సంజయ్ రామేశ్వర్ శర్మ అనే వ్యక్తి తన ఫేస్‌బుక్ వాల్‌పై వారి ప్రాంతీయ భాషలో పోస్ట్ చేశారు.

శ్రీ రామ్ జన్మభూమికి “న్యాయం” లభించిన తరువాత దీపావళిని జరుపుకుంటానంటూ కాస్త అభ్యంతరకర రీతిలో పోస్ట్ రాశారు. దీంతో సోషల్ మీడియా పోస్టులను పర్యవేక్షించే పోలీసు బృందాలు శర్మ ఫేస్బుక్ పోస్ట్‌ ఆధారంగా అతనిని అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 153 (1) (బి), 188 కింద శర్మను అరెస్టు చేశారు.

తీర్పు వెల్లడికి ముందుగాని, తర్వాతగానీ వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్‌తో సహా ఏ సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌లో అయినా హింసను ప్రేరేపించేలా, మతవిద్వేషాలను రగిలించేలా, విద్వేషపూరిత పోస్టింగ్స్ రాస్తే గ్యాంగ్‌స్టర్ యాక్ట్, జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఎ) ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు.