ఏపీ ఆదర్శంగా…మహారాష్ట్రలోనూ “దిశ చట్టం”

మహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి అఘాయిత్యాలకు పాల్పడితే 21రోజుల్లోనే విచారణ పూర్తిచేసి నిందితులకు ఉరిశిక్ష విధించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల దిశ యాక్ట్-2019ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టంపై దేశవ్యాప్తంగా పలువురు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. దిశ చట్టం తీసుకొచ్చిన ఏపీ సర్కార్ పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు మహారాష్ట్ర కూడా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన “దిశ చట్టం”పై ప్రశంసలు కురిపిస్తోంది.
దిశ చట్టం మాదిరిగా కఠిన చట్టం తీసుకువారాలనే యోచనలో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం ఉంది. మహిళలపై జరిగే క్రూరమైన నేరాల్లో సత్వర న్యాయం అందించేందుకు ఏపీ దిశ యాక్ట్ మాదిరిగా చట్టాన్ని తీసుకొచ్చే అంశంపై ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తుందని మహారాష్ట్ర హోంమంత్రి ఏక్‌నాథ్ షిండే బుధవారం(డిసెంబర్-18,2019)శాసనమండలిలో తెలిపారు. రాష్ట్రంలో మహిళలు, అమ్మాయిలు ఎలాంటి భయం లేకుండా జీవించాలనేదే తమ అభిమతమని షిండే అన్నారు.
చిన్నారులపై జరుగుతున్న నేరాల్లో విచారణ కోసం 25 ప్రత్యేక కోర్టులు, 27 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటయ్యాయి. సైబర్ నేరాలపై విచారించేందుకు 43 పోలీస్‌స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. వచ్చే 2 నెలల్లో సైబర్ క్రైం డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న 164 పోస్టులను వచ్చే 2 నెలల్లో భర్తీ చేయనున్నట్లు షిండే తెలిపారు