కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని అల్లుడి కుటుంబపై దాడి

కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని అల్లుడి కుటుంబపై దాడి

Updated On : June 21, 2021 / 1:35 PM IST

కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని ఆగ్రహించిన తండ్రి ఆర్నెల్ల తర్వాత అల్లుడి కుటుంబంపై దాడి చేసి నలుగురిని హతమార్చాడు. ప్రేమ పెళ్ళి చేసుకున్న కూతురు ఆస్తిలో వాటా అడిగే సరికి ఆగ్రహంతో రెచ్చిపోయి మారణ హోమం సృష్టించాడు. సంతోషంలో మునిగి తేలాల్సిన కొత్త జంట విషాదంతో దిగ్భ్రాంతికి గురైంది. కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరులో శనివారం ఈ మారణహోమం చోటు చేసుకుంది.

సుక్కాలపేటలో ఉండే మౌనేష్‌ (25), మంజుల(22) ప్రేమించుకున్నారు. ఇద్దరిదీ ఒకే కులం. మంజుల తండ్రికి ఈ పెళ్లి ఇష్టం లేక పోవటంతో, మౌనేష్‌ కుటుంబ సభ్యులే పెళ్లిచేశారు. వారి ఇంట్లోనే కొత్త దంపతులు కాపురం పెట్టారు. అప్పటి నుంచి కూతురిపై మంజుల తండ్రి అంబణ్ణ (55) పట్టరాని కోపంతో ఉన్నాడు. మంజుల తండ్రి ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపధ్యంలో శనివారం మంజుల తండ్రి ఇంటికి వెళ్లి తనకు ఆస్తిలో రావాల్సిన వాటాను ఇవ్వాలని కోరింది. తండ్రి రెండో పెళ్లి చేసుకున్నందున, తనకు ఆస్తి దక్కదేమోనని మంజుల భయపడింది. కూతురు వచ్చి ఆస్తి అడిగే సరికి ఆగ్రహం పట్టలేక మీ అంతచూస్తానని అంబణ్ణ బెదిరించాడు.

దీంతో ఆమె భయపడి ఇంటికి తిరగి వచ్చింది. భర్తతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తండ్రిపై ఫిర్యాదు చేసే పనిలో ఉంది. ఇంతలో ఆమె తండ్రి అంబణ్ణ , దొడ్డ ఫక్కీరప్ప(55), సన్న ఫక్కీరప్ప (60), సోమశేఖర్‌ అనే బంధువులతో కలిసి అల్లుని ఇంటికి వచ్చాడు. వచ్చీ రావడంతోనే అల్లుని కుటుంబ సభ్యులపై కత్తులు, కొడవళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఇష్టానుసారంగా పొడిచి, గొంతులు కోసి పరారయ్యారు. ఈ పాశవిక దాడిలో మౌనేష్‌ అన్న నాగరాజు(38), అక్క శ్రీదేవి (30), పెద్దన్న హనుమేష్‌ (40), తల్లి సుమిత్ర (55) అక్కడికక్కడే విగతజీవులుగా మారారు. ఇక తండ్రి వీరప్ప(65), రేవతి (20), తాయమ్మ (25) గాయాల పాలయ్యారు.

ఇంటి వద్ద రక్తపు మడుగుల్లో పడిఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతమంతా బీభత్సంగా తయారైంది. ఎటుచూసినా శవాలే కనిపించాయి. మంజుల తండ్రి అంబణ్ణ ఇంటికి వెళ్లి ఆస్తిలో వాటా కావాలని కోరటమే ఈ హత్యలకు కారణమని ఎస్పీ వేదమూర్తి తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పట్టణ ఆస్పత్రికి తరలించారు. నిందితులను పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.